తరుగుతున్న తీరం..!
సుదీర్ఘ సముద్ర తీరం కోతకు గురవుతుందంటే అందుకు కారణం సరుగుడు చెట్లు, మడ అడవులు మాయం కావడమే. వీటికి రక్షణగా నిలిచే అటవీశాఖాధికారులు స్పందించి తీర ప్రాంతంలో ఉండే చెట్లును కాపాడాలి. మత్స్యశాఖ వారు తాటి వనాలు, సరుగుడు చెట్లు పెంచేందుకు కృషి చేయాలి. నా చిన్నతనం నుంచి చూస్తున్నా సముద్రం ఈ 20 ఏళ్లలో సుమారు రెండు వందల మీటర్లు ముందుకు వచ్చింది.
– చీకటి కృష్ణ, మత్స్యకార యువకుడు,
డొంకూరు, ఇచ్ఛాపురం మండలం
తీర ప్రాంతంలో ఇసుక దిబ్బలు కోతకు గురికాకుండా తాటి వనాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. స్థానికుల సహకారంతో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సరుగుడు చెట్లు పెంచేందుకు సంబంధిత రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది.
– వై.సత్యనారాయణ, డీడీ,
మత్స్యశాఖ, శ్రీకాకుళం
ఇచ్ఛాపురం రూరల్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రతిఏటా సముద్ర మట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఫలితంగా సముద్రం క్రమేపీ ముందుకొచ్చి తీరాలు తరిగిపోతున్నాయి. దీంతో ప్రకృతి అందాలు.. అలల సవ్వడలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకులకు నిరాశ ఎదురవుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి నెల్లూరులోని తడా వరకు మత్స్యకార గ్రామాల భూములు నిత్యం కరిగిపోతున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం పొడవునా సముద్రం కోతకు గురయ్యింది. ప్రతీ సంవత్సరం తీరంలోని భూమి సుమారు రెండు నుంచి మూడు మీటర్ల మేర కోతకు గురవుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాయమవుతున్న తోటలు
జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల తీర ప్రాంత భూములను గాలులతో, తుఫానులతో రక్షించే సరుగుడు తోటలు క్రమేపీ మయామైపోతున్నాయి. చెట్లు వేళ్లు బయటపడిపోయి నేలపట్టు కోల్పోయిన సరుగుడు చెట్లు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. అంతేకాకుండా అటవీశాఖాధికారుల అలసత్వం మూలంగా కొంతమంది కలప దొంగలు రహస్యంగా మడ అడవులు, సరుగుడు చెట్లను నరికేస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తీర ప్రాంతాల్లో సరుగుడు, తాటి వనాలు ఏర్పాటు చేయడం ద్వారా తీరాన్ని రక్షించుకోవచ్చని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. కానీ కొన్ని తీర ప్రాంతాల్లో ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడం మూలంగా తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఉష్ణ మండల తుఫానులు, రుతు పవనాలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుల తదితర కారణాలతో తీరప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తరుగుతున్న తీరం..!
తరుగుతున్న తీరం..!
తరుగుతున్న తీరం..!


