అరాచకం తప్ప అభివృద్ధి ఏదీ..?
అక్రమ కేసులకు బెదిరేది లేదు వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
వజ్రపుకొత్తూరు/వజ్రపుకొత్తూరు రూరల్: వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి అజెండాగా పనిచేస్తే ఈ ప్రభుత్వం మాత్రం అరాచకాలు సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కాశీబుగ్గ పోలీసులు ఆయనను శనివారం సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంపై విషం చిమ్ముతోందని దుయ్యబట్టారు. ఉన్నత చదువులు చదివి వైద్యునిగా సేవలందించి ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వైఎస్ జగన్ వెంట అడుగులు వేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రూ.700 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుతో ఇంటింటికీ శుద్ధ జలాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని తెలిపారు. డిగ్రీ కాలేజీ, రోడ్ల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతంలో పలాసలో డోకి హరీష్‌కు న్యాయం జరగాలని అడిగినందుకు కేసు పెట్టారని, బాధితుల తరఫు న పోరాడడం కూడా నేరమేనా అని ప్రశ్నించా రు. ప్రత్యేక హోదా, తిత్లీ పరిహారం, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని అడిగినందుకు కేసులు పెట్టారని, బాలికపై జరిగిన దాడిని నిలదీసినందుకు, వైఎస్సార్ కిడ్నీ ఆస్పత్రి బోర్డు తొలగిస్తే ప్రశ్నించినందుకు కూడా కేసులు పెట్టడం ప్రభుత్వ నీతి మాలిన చర్య అని అన్నా రు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మానసికంగా వేధించినా తన కమిట్‌మెంట్‌ను మార్చలేరని అన్నారు. ఇటీవల కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వ రస్వామి ఆలయ తొక్కొసలాట ఘటనపై నిలదీసినందుకు మరో కేసు పెడతారేమోనని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా అని నిలదీశారు.
వైఎస్ జగన్ పాలనలో జరిగిన శంకుస్థాపనలే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పలాసకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకు వచ్చారా.. ఏ ప్రాజెక్టు తీసుకు రావాలో ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అక్రమ అరెస్టులు, అన్యాయాలు చేయడం సరికాదన్నారు. బాలికపై అత్యాచారం చేసిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం ఏమిటని నిలదీశారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తుందని, తాము అభివృద్ధి మీదే దృష్టి పెడతామని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర నేతలు పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర ఇంటిలెక్చువల్ నేత ఎం. మన్మధరావు, బోర బుజ్జి, మాజీ ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్, వైఎస్సార్‌సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, దున్న బాలరాజు, చింత హేమారావు, నియోజకవర్గ విద్యార్థ్ధి విభాగం అధ్యక్షుడు బమ్మిడి సంతోష్‌కుమార్, వజ్రపుకొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు తిర్రి రాజారావు, పైల అప్పారావు, చింత రాజు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


