స్కూల్ గేమ్స్ క్రికెట్ ఛాంపియన్‌గా అనంతపురం
● రన్నరప్‌గా నిలిచిన తూర్పు గోదావరి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 బాలికల క్రికెట్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను అనంతపురం కై వసం చేసుకుంది. రన్నరప్‌గా తూర్పుగోదావరి నిలవగా, విజయనగరం మూడో స్థానంలో, పశ్చిమ గోదావరి నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ/ఇంటర్మీడియట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన 69వ ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) స్కూల్ గేమ్స్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 69 పరుగులు చేసింది. 70 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జట్టు 58 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఆతిథ్య శ్రీకాకుళం జిల్లా జట్టుపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాపై పశ్చిమ గోదావరి జిల్లా జట్లు విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పశ్చిమ గోదావరిపై విజయం సాధించిన తూర్పు గోదావరి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అలాగే రెండో సెమిస్‌లో విజయనగరం జట్టుపై గెలుపొంది అనంతపురం జిల్లా ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా మరో కీలకమైన మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పశ్చిమ గోదావరిపై విజయనగరం జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లకు నిర్వహణ అధికారులుగా ఎం.ఆనంద్ కిరణ్, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు, రాజ్‌కుమార్, రాజబాబులు వ్యవహరించారు.
బహుమతులు అందజేత
పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు రాష్ట్ర పరిశీలకుడు రాజేష్ గోలా, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ సంఘ సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి బహుమతులు, మెడల్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లోను రాణించాలని వారంతా ఆకాంక్షించారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, మెట్ట తిరుపతిరావు, పేడాడ బాబూరావు, పీడీలు, పీఈటీలు, వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.


