ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు!

Nov 8 2025 7:32 AM | Updated on Nov 8 2025 7:32 AM

ఎవరొస

ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు!

● సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ గుబులు

● కొత్త కారు, కొత్త వ్యక్తులు వస్తే భయపడిపోతున్న సిబ్బంది

● శ్రీకాకుళం మినహా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

● జిల్లాలోనూ క్రయ, విక్రయాలపై తీవ్ర ప్రభావం

● లంచాలు తీసుకునే అధికారుల గుండెల్లో రైళ్లు

రణస్థలం: రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండు రోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం మినహా దాదాపు అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వింత వాతావరణం నెలకొంటోంది. కొత్తగా కారు వచ్చినా, తెలియని వ్యక్తులు కనిపించినా చాలు.. ఏసీబీ అధికారులు వస్తున్నారంటూ సిబ్బంది హడలిపోతున్నారు. కొందరైతే భయంతో ఏకంగా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు.

కానరాని డాక్యుమెంట్‌ రైటర్లు..

భూముల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆన్‌లైన్‌ చేయాలన్నా, స్లాట్‌ బుక్‌ చేయాలన్నా, క్రయ, విక్రయదారుల వేలిముద్రలు వేయాలన్నా, ఆధార్‌ ఓటీపీ తీసుకోవాలన్నా, ఆపై కొర్రీలుంటే కార్యాలయ సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పాలన్నా అంతా డాక్యుమెంట్‌ రైటర్లదే హవా. అటువంటి రైటర్లు ఉండే అద్దె భవనాలు, రేకుల షెడ్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏసీబీ దాడుల భయంతో క్రయ, విక్రయాల లావాదేవీలపై కొర్రీలు ఉన్నవారు వారం రోజుల పాటు రిజిస్ట్రార్‌ కార్యాలయాల వైపు రావొద్దని సమాచారం చేరవేస్తున్నారు. కొత్త వ్యక్తులు వస్తే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొందరు రైటర్లు అద్దె భవనాలు ఖాళీ చేసి బయట తిరుగుతున్నారు.

ఇష్టారాజ్యంగా వసూళ్లు..

ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ పుణ్యమా అని కొందరు తమకు అనుకూలమైన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు పెట్టి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎనీవేర్‌ డాక్యుమెంట్లు వస్తే తమ వద్దనే అట్టిపెట్టుకుని నచ్చినంత సొమ్ము డిమాండ్‌ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిషేధిత భూముల్ని ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. డీ–పట్టా భూములకు పక్కా జిరాయితీ నంబర్‌ వేసి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. గ్రామ కంఠం, వివాహ రిజిస్ట్రేషన్‌, మార్ట్‌గేజ్‌, గృహ నిర్మాణాల తాకట్లు లావాదేవీలపైనా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు.

మాకు సంబంధం లేదు..

ఏసీబీ దాడులకు క్రయ, విక్రయాలకు ఎటువంటి సంబంధం ఉండదు. రిజిస్ట్రేషన్లు అనేవి క్రయ, విక్రయదారుల ఇష్టం ప్రకారం జరుగుతుంటుంది. డాక్యుమెంట్‌ రైటర్లు ఉండటం లేదనేది మా పరిధిలో ఉండదు. ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం మాకు సంబంధం లేని అంశం. – ఎ.నాగలక్ష్మి,

డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ

ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు! 1
1/1

ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement