విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి
నరసన్నపేట: మండలంలోని పారశిల్లి–రెల్లివలస గ్రామాల మధ్య కొత్త విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో వ్యవసాయ మోటార్లకు ప్రత్యేక లైన్ వేసేందుకు రీవేంప్డ్ డెవలప్‌మెంట్ సెక్టార్ స్కీమ్(ఆర్‌డీఎస్‌ఎస్)లో భాగంగా రెండేళ్లుగా పనులు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం రెల్లివలస వద్ద ట్రాక్టర్ పైనుంచి విద్యుత్ స్తంభం కిందకు దించి పైకి ఎత్తుతున్న క్రమంలో టాక్టర్ పక్కకు ఒరిగిపోవడంతో స్తంభం పడి నడగాంకు చెందిన బానాల రాము(37) మృతి చెందగా, జోగి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేటకు తరలించారు. రాంబాబును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా, రాముకు రెండు నెలల క్రితమే కుమార్తె పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే ప్రమాదం జరగడంతో భార్య ఢిల్లీశ్వరి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నడగాం సర్పంచ్ జల్ల మాధురి, వైఎస్సార్ సీపీ నాయకులు లుకలాపు రవి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.


