మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ
ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన ఏఎస్‌ఐ తెలుకుల రామారావు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. సుమారు 65 ఏళ్ల డబ్బూరి నారాయణారావు అనే వృద్ధుడు బిక్షాటన చేస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జీవనం సాగించేవాడు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన కాంప్లెక్స్ ఆవరణలో అనారోగ్యానికి గురవ్వడంతో స్థానికులు అతడిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీస్‌స్టేషన్ రైటర్ రంజిత్ వివరాలు నమోదు చేశారు. దీంతో కంచిలిలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రామారావు సమాచారం తెలుసుకొని వృద్ధుడి మృతదేహాన్ని అంతిమయాత్ర రథంపై బాహుదానదికి తీసుకెళ్లి హిందూ సాంప్రదాయబద్దంగా కుమార్తె గీత సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ మాట్లాడుతూ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 20 ఏళ్లుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు. అలాగే వారికి పెద్దకర్మ చేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తుంటానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 65 అనాథ మృతదేహాలకు ఈవిధంగా అంత్యక్రియలను నిర్వహించానని పేర్కొన్నారు. దీంతో ఏఎస్‌ఐను పలువురు అభినందించారు.


