తీరంలో అప్రమత్తం
గార: కార్తీక పౌర్ణమితో పాటు శని, ఆదివారాల్లో తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం మైరెన్ సీఐ బి.ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వేకువ జామున 3 గంటల నుంచి మైరెన్ పోలీసులు తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉంటారని, దీపాలు విడిచిపెట్టే సమయం, స్నానాలు పట్ల అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నీటిలో ఎక్కువ దూరం లోపలకు వెళ్లకూడదని, తుఫాను ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురవ్వడంతో పాటు, కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి బయటకు కనిపించకుండా ఉన్నాయని, మనిషి వెళితే దిగబడిపోయే అవకాశాలెక్కువ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. మద్యం సేవించడం, గందరగోళం సృష్టించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు తప్పవన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్నానాలకు దిగకూడదని, ఎటువంటి సమస్య తలెత్తినా డయల్ 100కు సమాచారమివ్వాలని కోరారు.


