నేడే ఎందువ కై లాసగిరి ప్రదక్షిణ
జి.సిగడాం: మండలంలోని ఎందువ గ్రామంలో కై లాసిగిరి కొండపై వెలసిన కై లాశేశ్వర క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు భారీ పోలీసు బందోస్తు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. మంగళవారం గ్రామంలో కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటలకు 21 అడుగుల శివపార్వతుల విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. సాయంత్రం కై లాసగిరి శిఖరంపై అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని, వేదపండితులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జె.ఆర్.పురం సీఐ అవతారం, తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, ఎస్‌ఐ వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష ఎందువలో పర్యటించి ఏర్పాట్లపై ఆరా తీశారు.


