అగ్ని ప్రమాదంలో మూగజీవాలు మృతి
రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో పాడిరైతు పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన పశువుల షెడ్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రెండు ఆవులు, నాలుగు దూడలు మృతి చెందాయి. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో షెడ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెక్క దూలాలకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న ఆటో, స్కూటీలతో పాటు వాటర్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అదే షెడ్‌లో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందర్ సిబ్బందితో వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. పాతర్లపల్లి పశువర్థక అధికారి డి.చంద్రశేఖర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు పిన్నింటి సాయికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిహారాన్ని అందేలా కృషి చేస్తానని రైతును ఓదార్చారు.ఆయన వెంట సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ, నాయకులు మహంతి పెదరామినాయుడు, వెంకటప్పలనాయుడు, పిన్నింటి శ్రీచరణ్, మహంతి అప్పలనాయుడు, గొర్లె కన్నా, వాళ్లే అప్పలన్న, లంక హరీష్, గొర్లె సత్యం, వలిరెడ్డి సూరిబాబు తదితరులు ఉన్నారు.
అగ్ని ప్రమాదంలో మూగజీవాలు మృతి


