పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణపై దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసంతోపాటు మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీసీ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. క్యూలైన్లు, భద్రత, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ నిర్వహణ విషయంలో ఎక్కడా లోటు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు యంత్రాంగం, ఆలయ కార్యనిర్వహణ అధికారులు, స్థానిక సంస్థలు సమన్వయంగా పనిచేయాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పారిశుద్ధ్య నిర్వహణ, శాంతి భద్రతలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి, 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున, 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. జిల్లాలో 200 ఈ–హబ్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు


