రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధి
శ్రీకాకుళం: రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో రాష్ట్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని రాష్ట్ర జాతీయ రహదారుల చీఫ్ ఇంజినీర్ వి.రామచంద్ర చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు మంజూరు చేశారని, విడతల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పాడైన రహదారులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లాకు వచ్చినట్లు చెప్పారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేస్తామన్నారు. ఆయనతో పాటు జిల్లా రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ పి.సత్యనారాయణ, ఇతర ఇంజినీర్లు ఉన్నారు.


