వైభవంగా మహాభజన సమారోహణ
పర్లాకిమిడి: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా పర్లాకిమిడి శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో మంగళవారం సాయంత్రం మహాభజన సమారోహణ కార్యక్రమాన్ని కళా సంస్కృతి సేవా ట్రస్టు, హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరిగినది. తొలుత శ్రీజగన్నాథ స్వామికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించగా సమలై నృత్య కళాకారులు, మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ, సమలై నృత్య అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ కార్యక్రమాలు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. అనంతరం కుమారి తపస్వీ కోరో...అలిగిరి నందినీ.. పాటతో డ్యాన్సుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భువనేశ్వర్‌కు చెందిన శ్రీచరణ్ మహాంతి, అంజిలీ మిశ్రా భక్తిగీతాలతో ప్రేక్షకులను తన్మయ పరిచింది. హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి వేదికపై కుమారీ తపస్వీకోరోకు రూ.5 వేలు, మెమొంటోతో సత్కరించారు. అలాగే మిరాకిల్ డ్యాన్సు అకాడమీ అధినేత శథపతి, సమలై నృత్య అకాడెమీ నిర్వాహకులు బాలకృష్ణ పాణిగ్రాహికి మెమొంటోలతో సత్కరించారు.


