ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం జంక్షన్ ఫ్లై ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగాక లారీ ఆపకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కల్లుగీత కార్మికుడు వెంటనే స్థానికుల సాయంతో అత్యవసర విభాగాలకు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్టీరింగ్ వద్ద ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అతని వద్ద లభించిన ఆధారాల మేరకు తమిళనాడు రాష్ట్రం అవడి పట్టణానికి చెందిన ఆకాష్ (29)గా గుర్తించారు. ఇతను ఎల్‌అండ్‌టీ పరిశ్రమలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమచారాం. ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై నక్క కృష్ణారావు తెలిపారు. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా ఎచ్చెర్ల పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
లారీని కారు ఢీకొట్టిన ఘటనలో తమిళనాడు వ్యక్తి మృతి
జరజాం ఫ్లై ఓవర్ సమీపంలో ఘటన
ప్రాణం తీసిన నిద్రమత్తు!