
వేలి కొనలపై
ఆమదాలవలస రూరల్: సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి వెల్లడించారు. జిల్లాలో ఓటర్ల సంఖ్యను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ ఓట్ల ఉన్నాయో లేవో వివరాలు ఎలా తెలుసుకోవాలో అన్న మీమాంస చాలా మందిలో ఉంటుంది. వాటికి సమాధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు మీ ఓటు ఉందో, లేదో మీ ఇంటి డోర్ నంబర్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దొంగ ఓట్లు ఉంటే వాటిని కూడా తెలుసుకోవచ్చు.
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో
● ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకటి ఎంపిక చేసుకుని రిజిస్టర్ చేయాలి. తరువాత మీ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి.
● బార్ కోడింగ్ స్కానింగ్ ద్వారా పాత ఓటరు కార్డుల ముందు భాగంలో బార్ కోడ్ ఉంటుంది. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లోని బార్ కోడ్ ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. కెమెరా తెరుచుకోగానే ఓటరు కార్డుపై ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఓటు వివరాలు వస్తాయి.
● క్యూర్ కోడ్ స్కానింగ్ ద్వారా కొత్త ఓటరు కార్డులు క్యూఆర్ కోడ్‌తో వస్తున్నాయి. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లోని క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంపిక చేసుకుని స్కాన్ చేస్తే మీ ఓటరు వివరాలు తెలుస్తాయి.
● వివరాల నమోదు చూసి దీని ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డులో ఉన్నట్లు గానే పేరు, తండ్రి పేరు, వయస్సు, లింగం, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలు నమోదు చేస్తే మీ ఓటు గురించి తెలుసుకోవచ్చు.
● ఓటు కార్డు నంబర్‌తో ఓటరు వివరాలు తెలుసుకోవచ్చును. ప్రతి ఓటర్ కార్డుకు నంబర్ ఉంటుంది. నంబర్ ఆప్షన్ ఎంచుకుని మీ కార్డు నెంబరు నమోదు చేస్తే ఓటు వివరాలు తెలుస్తాయి.
● పై నాలుగు విధానాల్లో ఇది చాలా సులువుగా ఉంటుంది. మీ వద్ద కార్డు లేకపోతే నంబరు ఉంటే చాలు మీ ఓటు వివరాలు తెలుస్తాయి.
ఓటర్ హెల్ప్ యాప్‌లో ఓటు హక్కు వివరాలు
ఆన్‌లైన్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు
ఓటరు కార్డు నంబర్‌తో వివరాలు లభ్యం
