శ్రీకాకుళం క్రైమ్: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూ) సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమ వారం మరోమారు దాడులు చేశారు. జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసగృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదా లు జరిపారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 4 స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవనం సహా), సుమారు 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరియా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఆయనపై విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణల మీద దాడులు చేశారు. అప్పట్లో రూ.1,84,070 డబ్బు దొరకడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.
డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..?
ఈ మొత్తం ఎపిసోడ్‌పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూ బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెలవు కోరు తూ దరఖాస్తు జిల్లా అధికారికి పెట్టుకున్నారు. దానికి ఆమె సెలవు మంజూరు, పింఛన్‌కు సంబంధించి ప్రపోజల్స్ పూర్తిగా చేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్ వసతిగృహాల విద్యార్థుల మెస్‌బిల్లులు మంజూరు చేసినందుకు రావాల్సిన మా మూళ్లు కలెక్ట్‌చేసి తీసుకురావాలని కోరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


