కవిటి: ఇండియన్ రైల్వేస్‌లో విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా కవిటి ఉద్దానంకు చెందిన పూడి హరిప్రసాద్ సోమవారం విశాఖపట్నంలోని రైల్వే జోనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కవిటి ఉద్దానం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇంతటి పెద్ద హోదా లభించడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ విశ్రాంత ఉద్యోగి పిరియా రాజారావు అల్లుడు డాక్టర్ పూడి హరిప్రసాద్(ఐఆర్‌ఏఎస్) 1994 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత పొందారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సా యిరాజ్ బావ అయిన హరిప్రసాద్ తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం నుంచే పలు ఉన్నత పదవులను అలంకరించారు.
8న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8వ తేదీన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన మాత్రమే గుర్తుకొస్తుందన్నారు. మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్, పోలీస్ స్టేషన్లను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
మహిళలకు రక్షణ కరువు
జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మహిళలకు మొండిచేయి చూప డం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, చల్ల అలివేలు మంగ, సుగుణ, ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు, అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మహిళలు అదృశ్యమవుతున్నారని గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్, ఇప్పుడు అధికారంలో ఉండి వారిని ఎందుకు ఇళ్లకు చేర్చడం లేదని నిలదీశారు. సమావేశంలో పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్లలోని డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన అడ్డగోలు నియామకాలు వెంటనే రద్దు చేయాలని, వాటి స్థానంలో నోటిఫికేషన్ వేసి రోస్టరు, మెరిట్ ఆధారంగా అర్హులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇలాంటి విధానాల వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు యజ్జల గురుమూర్తి, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్, ఎచ్చెర్ల ఎస్సీ సెల్ నాయకులు బి.శశిభూషణ్, టెక్కలి ఎంపీపీ ప్రతినిధి దళిత యువజన నాయకులు ఆట్ల రాహుల్ కుమార్‌లు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్లలోని యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో సుమారు 40 మందిని వివిధ రకాల ఉద్యోగాల్లో వేశారని, ఈ నియామకాలు ఏ ప్రాతిపదికన జరిగాయో తెలీదని తెలిపారు. అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి, ఆ నియామకాలను రద్దు పరచి, నోటిఫికేషన్ వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నియామకాలను చేపట్టాలని వారు కోరారు.


