● జిల్లా కేంద్రంలో అదుపులోకి రాని డయేరియా
● అధికారులపై ఒత్తిడి
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు హడావుడి చేస్తున్నా డయేరియా వ్యాధి మాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో మూడు, నాలుగు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పుడు కాలువలు తీయించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి చర్యలు చేపడుతున్నారు. డయేరియా ప్రబలడానికి కమిషనరే కారణమంటూ 14 రోజులు మాత్రమే బాధ్యతలు నిర్వహించిన కూర్మారావును సస్పెండ్ చేసిన అధికారులు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వాటర్ వర్క్స్ డీఈని కూడా సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఓ శానిటరీ ఇన్ స్పెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు మండిపడుతూ సమ్మె దిశగా ఆలోచన చేస్తుండగా.. వారిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపాన పాపారావు అనే శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆందోళనకు గురై ఆస్పత్రి పాలై ఆదివారం డిశ్చార్జి అయ్యారు.


