వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

హిందూపురం: హిందూపురం రైల్వేస్టేషన్‌లో కోయంబత్తూరుకు చెందిన వృద్ధురాలు నాగలక్ష్మి మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును దొంగ లాక్కుపోయాడు. కోయంబత్తూర్‌ నుంచి హిందూపురం తూమకుంట వద్ద పెళ్లికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి నాగలక్ష్మి కుటుంబసభ్యులు వచ్చారు. రైలు దిగి మిగిలిన వారు కాస్త ముందు వైపు నడుస్తుండగా వృద్ధురాలు నిదానంగా వెళ్తోంది. గమనించిన దొంగ ఆమె మెడలోని గొలుసును లాక్కుని రైలెక్కి పరారయ్యాడు. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారని రైల్వేస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎర్రిస్వామి తెలిపారు.

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

హిందూపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన హిందూపురం మండలం వినాయక నగర్‌ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పళనీనగర్‌కు చెందిన మణికంఠ (40) హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య వలియమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి వినాయక నగర్‌ సమీపంలో ఐటీఐ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మణికంఠను వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీతాలు వెంటనే చెల్లించాలి

అనంతపురం న్యూటౌన్‌: తమకు రావాల్సిన నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సత్యసాయి వాటర్‌ సప్లై కార్మికులు డిమాండ్‌ చేశారు. సోమవారం కార్మికులు బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సత్యసాయి వాటర్‌ సప్లై కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు కార్మికులకు చెల్లించాల్సిన రూ. 2.5 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డ్‌ అకౌంట్లో నిధులు ఉన్నా కార్మికులకు జీతాలు చెల్లించకుండా బోర్డు మెంబర్‌ సెక్రటరీ, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమర్థనీయం కాదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే జూలై 6న బోర్డు ఆఫీస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లై వర్కర్స్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్‌, సెక్రటరీ శ్రీరాములు, ట్రెజరర్‌ వన్నూరప్ప, వీరాంజనేయులు, వెంకటేశులు, చిన్న బాబయ్య, రవీంద్ర చారి, మస్తాన్‌ వలి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

డి.హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌): విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘ టన డి.హీరేహాళ్‌ మండలంలోని తిమ్మలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన గంగప్ప, వండ్రమ్మ దంపతులకు మల్లికార్జున (27) కుమారుడు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం క్రితం కర్ణాటక రాష్ట్రం తిమ్మలాపురం గ్రామానికి చెందిన అనుషతో మల్లికార్జునకు వివాహం కాగా, ఐదు రోజుల క్రితం వీరికి మగబిడ్డ పుట్టాడు. కొడుకును హాస్పిటల్‌లో చూసి ఇంటికి వచ్చిన మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి టేబుల్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి వండ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

జంతలూరులో మరో యువకుడు..

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జంతలూరు గ్రామంలో కిష్టయ్య, ఓబులమ్మ కుమారుడు సాయి (26) ట్రాక్టర్‌లో కట్టెలు వేసుకుని వస్తుండగా స్కూల్‌ వద్ద కిందికి వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో షాక్‌కు గురైన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement