వైఎస్సార్‌సీపీ నాయకుడి కార్యాలయంపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి కార్యాలయంపై దాడి

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

తాడిపత్రిటౌన్‌: పట్టణంలోని టైలర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్‌ సెక్రటరీ నరసింహారెడ్డి కార్యాలయంపై టీడీపీకి చెందిన మౌలాలి, షఫీతోపాటు మరో ముగ్గురు ఆదివారం దాడి చేశారు. ఇనుప రాడ్లతో కార్యాలయ తాళాలు ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించారు. అందులోని టీవీ, రెండు ఏసీలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూటమి నేతల బాహాబాిహీ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్‌ పెట్రోల్‌ బంకు వద్ద కూటమి నేతలు ఇద్దరు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. ఆదివారం సాయంత్రం పెట్రోల్‌ వద్ద టీడీపీ నాయకుడు బుడేపల్లి సుభాన్‌కు బీజేపీనాయకుడు నాగిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదలు జరిగి, ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ గొడవ పడినట్లు తెలిసింది. గొడవ కారణంగా పెద్ద ఎత్తున జనం గూమిగూడారు. ఎస్‌ఐ సురేష్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువురినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. రోడ్డుపైనే టీడీపీ, బీజేపీ నాయకులు భౌతిక దాడులకు దిగడంతో వారి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి.

కోట ఊరువాకిలిలో

పీర్ల ప్రతిష్టపై వివాదం

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని కోట ఊరువాలికిలో ఆదివారం పీర్ల ప్రతిష్టపై ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఊరువాకిలి స్థలంలో పీర్లను ప్రతిష్టిస్తూ వస్తున్నారు. మొహర్రం సందర్భంగా నిర్వాహకులు పీర్లను కొలువు దీర్చుతుండగా, వీహెచ్‌పీ, హెరిటేజ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అడ్డుకొని అభ్యంతరం తెలిపారు. రూ.80 లక్షలతో కోట ముఖద్వారం ఊరువాకిలి జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్న ప్రదేశమని, ఇకపై ఇక్కడ పీర్ల పండుగ జరుపరాదని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశః ఉండడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement