ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టడానికి సమాయత్తమయ్యారు. ఆర్టీసీ యూనియన్లన్నీ ఏకమై మంగళవారం నుంచి పోరాటం చేయనున్నాయి. ఈ ఉద్యమాన్ని నడపించేందుకు వివిధ యూనియన్ల నాయకులు జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేశారు.
మడకశిర: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో మడకశిర, హిందూపురం,ఽ ధర్మవరం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో వేలాది మంది ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు.
ప్రైవేట్ పరం చేసేలా..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడానికి అడుగులు వస్తోంది. దీన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ బస్సులను ప్రభుత్వం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపకుండా ప్రైవేట్ వారికి అప్పగించింది. ఈ చర్యను ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలోనే విద్యుత్ బస్సులను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బస్సులను సాకుగా చూపుతూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలోని పలు డిపోలను ప్రైవేట్ వారికి అప్పగించింది. దాదాపు 11 డిపోలను ప్రైవేట్ వారికి అప్పగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పీఆర్‌సీని కూడా అమలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీ్త్రశక్తి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న సాకులు చూపి ఆర్టీసీ కార్మికులకు పనిష్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు అనేక డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు.
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్న కార్మికులు
విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్‌వారికి అప్పజెప్పకూడదని డిమాండ్
రేపటి నుంచి
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
జిల్లా వ్యాప్తంగా ఈనెల 23, 24న ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే నిరసనలు చేయనున్నారు. తొలి దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు తెలుపనున్నారు. ఎర్ర బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారు. అంతే కాకుండా గేట్ మీటింగ్‌లు నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించనున్నారు. ఆ తర్వాత జేఏసీ నాయకులు రెండో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని స్థానిక జేఏసీ నాయకులు చెబుతున్నారు.


