పెనుకొండ రూరల్: పెనుకొండ నగర పంచాయతీలో మురుగు రోడ్లపై పేరుకుపోయి కంపుగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఇదేనా మీ అభివృద్ధి అని మంత్రి సవితను ప్రశ్నించారు. 17వ వార్డు నారాయణమ్మకాలనీలో ఆదివారం ‘కాఫీ విత్ వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమంలో ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. ప్రతి గడప తిరుగుతూ ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసున్నారు. పలువురు కాలనీ వాసులు రహదారిపై పేరుకు పోయిన మురుగు నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు పడుతుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, సాయంత్రం పూట బయట కూర్చోలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. అనంతరం కాలనీలో రోడ్లపై నిలిచిపోయిన మురుగు నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. రోడ్లపై మురుగు నీరు ఎక్కడ పడితే అక్కడ నిలబడి పోయిందన్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతమంతా కంపు కొడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా నగర పంచాయతీలోని సమస్యలను మంత్రి సవిత పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నగర పంచాయతీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని డప్పు కొడుతున్నారని, క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయని విమర్శించారు.
సుగాలి ప్రీతికి న్యాయం చేశారా?
ఎన్నికల ప్రచారం కోసమే సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాడుకున్నారని ఉషశ్రీచరణ్ విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని తప్పుడు ప్రచారం చేశారని, రెండేళ్లలో ఎంత మందిని వెతికి తీసుకువచ్చారో చెప్పాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేదాకా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్ నాగళూరు బాబు, నాయకులు టెంపో శీనా, మహ్మద్, ఎంసీ నారాయణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎంఎన్ మూర్తి. సద్దాం బాబు, యాసిన్, శేషాద్రి, బోయ రాము, కొండల రాయుడు, విజయ్ కుమార్ రెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
మురుగు నీటిలో వరినాట్లు వేసిన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


