చాలు.. ఇక ఆపండి బాబూ | - | Sakshi
Sakshi News home page

చాలు.. ఇక ఆపండి బాబూ

Jun 21 2026 12:13 AM | Updated on Jun 21 2026 12:13 AM

కదిరి: ఎన్నికలకు మునుపు ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను నిలువునా మోసగించి, ఇప్పుడు విజయోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ‘రైతులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, ఉద్యోగులు, నిరుద్యోగులు..ఇలా అన్ని వర్గాలను మోసగించి ఈ సంబరాలేంటి?’ అని జనం మండిపడుతూ ‘నవ్విపోదురుగాక.. మాకేటి సిగ్గు’ అనే సామెతను గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్‌ గ్యారంటీ’ పేరుతో డిజిటల్‌ సంతకాలు పెట్టి మరీ గ్యారంటీ పత్రాలను అందించారనీ, అయితే ‘భవిష్యత్‌ గ్యారంటీ కాదు..మోసం గ్యారంటీ’ అని చెప్పినట్లయితే బాగుండేది..’ అంటూ మండిపడుతున్నారు.

ఆడబిడ్డలకు అన్యాయం..

18 ఏళ్లు నిండి 60 ఏళ్లు లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ నయాపైసా ఇవ్వలేదు. ఒక్కో మహిళకు చంద్రబాబు రూ. 36 వేలు బాకీ అని మహిళలు గుర్తు చేస్తున్నారు.

ఆపండి ‘గ్యాస్‌’ కబుర్లు..

ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ‘ముందు మీరు డబ్బు పెట్టి గ్యాస్‌ కొంటే తర్వాత మీ అకౌంట్‌లోకి ఆ డబ్బు జమ చేస్తాము’ అని చెప్పారు. క్షేత్ర స్థాయిలో చూస్తే గ్రామానికి ఐదారు గురికి తప్పా మిగిలిన ఎవరికీ ఆ డబ్బు జమ కాలేదు.

ఉద్యోగం లేదు..భృతి లేదు..

ఇంటికో ఉద్యోగం..లేదంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. ఇంత వరకూ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అసలే లేదు. ఆ ఇచ్చిన టీచర్‌ ఉద్యోగాలు సైతం తమకు కావాల్సిన వారికి అమ్ముకున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

50 ఏళ్లకే పింఛన్‌ ఏదీ?

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంత వరకూ ఆ ఊసే లేదు. అలాగే ఉన్న పింఛన్లలోనే కోత విధించారు.

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం..

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు ఖరీదైన ఉచిత వైద్యం ఇప్పుడు అందడం లేదు. ఎంతోమంది పేద, మధ్య తరగతి వారు డబ్బుపెట్టి వైద్యం చేయించుకోక తప్పలేదు.

వ్యవ‘సాయం’ ఏదీ?

రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామన్న డబ్బు మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే డబ్బుతో సంబందం లేకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, చంద్రబాబు సర్కారు రైతులను మోసం చేసింది. అలాగే ఉచిత పంటల బీమాకు చంద్రబాబు పూర్తిగా మంగళం పాడారు. ప్రీమియం చెల్లించిన రైతులకు కూడా బీమా సొమ్ము ఇవ్వలేదు.

వలంటీర్లకు రూ.10 వేలు ఎక్కడ?

వలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం రూ.5 వేలు మాత్రమే జీతం ఇస్తోందని,తాము అధికారంలోకి రాగానే వారికి నెలకు రూ. 10 వేలు ఇస్తామని బాబుతో పాటు పవన్‌ ప్రగల్బాలు పలికారు.అధికారంలోకి రాగానే జీతం పెంపు సంగతి దేవుడెరుగు ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.

హామీలను విస్మరించి

కూటమి నేతల సంబరాలు

మండిపడుతున్న జనం

నిరుద్యోగ భృతి ఏదీ అంటున్న

నిరుద్యోగులు

ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తావంటూ మహిళల నిలదీత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement