‘‘రెండేళ్లలో ఏం చేశాం మనం...ఒక్క పింఛన్ ఇవ్వలేదు...ఒక్క రేషన్ కార్డు అందివ్వలేదు. పైగా ఉన్న పింఛన్లు పీకేశాం..ఆరోగ్యశ్రీకి మంగళం పాడాం...రైతు కోసం సరైంది ఒక్క పథకమూ అమలు చేయలేకపోయాం..రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాం..ఇప్పుడు సంబరాలు చేసుకుంటే జనం తంతారు..నేనైతే రాను’’
.. రెండేళ్ల విజయోత్సవ సభకు రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధితో హిందూపురంలోని ఓ నాయకుడి చేసిన వ్యాఖ్యలివి. కూటమి నేతలంతా ఇలాగే భావించడంతో శుక్రవారం హిందూపురంలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలబోయింది.
చిలమత్తూరు: వెండితెరపై వేలాదిమందిని ఒంటిచేత్తే మట్టికరిపిస్తూ హిట్ కొట్టే బాలకృష్ణ...సొంత నియోజకవర్గంలో అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. నమ్మి ఓటేసిన ప్రజల సంక్షేమాన్ని పీఏలకు వదిలి హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయిన బాలకృష్ణకు హిందూపురం నియోజకవర్గ వాసులు ఇప్పుడిప్పుడే షాకులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘రెండేళ్లు’ విజయోత్సవ సభ అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఈ క్రమంలో హిందూపురంలోనూ ఎమ్మెల్యే పీఏలు కార్యక్రమం తలపెట్టారు. భారీగా జన సమీకరణ చేసి తామేందో చూపాలనుకుని పట్టణం నడిబొడ్డున ప్రధాన రహదారిపై సభ ఏర్పాటు చేశారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సభకు నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలున్నా, ఎవరూ ఈ సభపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వేసిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో స్థానిక చోటా లీడర్లు దారివెంట వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో హడావుడిగా కార్యక్రమం ముగించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్ కావడంతో అధిష్టానానికి ఏం సమాధానం చెప్పాలా అని ఎమ్మెల్యే పీఏలు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమే కారణమా..?
సంక్షేమం, అభివృద్ధి అంటూ టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తిస్తన్నా... వాస్తవం మరోలా ఉంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కడం ఒక ఎత్తయితే, అభివృద్ధి పేరిట నేతలు చేస్తున్న అవినీతి మరో ఎత్తు. ఎటు చూసినా వసూళ్ల్లకు పాల్పడుతూ సామాన్యులు, చిరు వ్యాపారులపై చేస్తున్న ఆకృత్యాలు ప్రజల్లో బలంగా వెళ్లడంతో విజయోత్సవాలపై కేడర్ ఆసక్తి చూపలేదనే చర్చ సాగుతోంది. ఇక టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కూటమి నేతలతోనూ సఖ్యత కొరవడటంతో విజయోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
‘రెండేళ్ల’ విజయోత్సవ సభలో పాల్గొనని కూటమి నేతలు
జనానికి ఏమీ చేయకుండా
సంబరమంటే తంతారని ఆవేదన
హిందూపురంలో వెలవెలబోయిన సభ


