ఓడీచెరువు: మండల పరిధిలోని టి.కుంట్లపల్లి పంచాయతీ బసప్పగారిపల్లి సమీపంలోని కరకమానుతోపు వద్ద శుక్రవారం బండకిందపల్లెకు చెందిన శ్రీనివాస్ (26) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాలమేరకు.. బండకిందపల్లె గ్రామంలోని నాగప్ప, మల్లమ్మ దంపతుల కుమారుడైన శ్రీనివాస్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితమే పైళ్లెనా మనస్పర్థల కారణంగా భార్య ఆయనతో కలిసిలేదు. విద్యుత్ లైన్ కింద ఉన్న కేబుళ్లు రిపేరీ చేస్తు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే శుక్రవారం కరకమానుతోపు వద్ద మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో వెనుతిరిగి వచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సోనా మసూరి పేరుతో స్టోర్ బియ్యం
పెనుకొండ రూరల్: తక్కువ ధరకే సోనా మసూరి బియ్యం పేరుతో రైతును వ్యాపారి మోసం చేిసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని రాంపురం పంచాయతీలోని కొండంపల్లికి చెందిన రైతు తులసీ ప్రసాద్ ఇంటి వద్దకు గురువారం వచ్చిన ఓ.. వ్యాపారి, సోనామసూరి బియ్యం 50 కేజీల బియ్యం బస్తా ధర రూ. 2,200కు అమ్ముతున్నట్లు నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన రైతు రూ.4,400 ఇచ్చి రెండు బస్తాలు కొనుగోలు చేశాడు. వ్యాపారి వెళ్లిన అనంతరం బస్తా విప్పి చూడగానే అందులో స్టోర్ బియ్యం ఉన్నట్లు గుర్తించాడు. జరిగిన ఘటనపై శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
కారు దగ్ధం
పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తూ కారులో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన మధు శుక్రవారం సాయంత్రం తన కారులో మునిమడుగు గ్రామానికి బయలు దేరారు. అయితే మార్గమధ్యలో గ్రామ సమీపంలో కారు ఇంజన్‌లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన చోదకుడు కారు దిగిపోయాడు. ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఘటనా స్థలంలోనే కారు పూర్తిగా కాలిపోయింది.
ఐచర్ ఢీకొని యువకుడి మృతి
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని రామినేపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజరి ఉజ్జినప్ప కుమారుడు రంజిత్ (25) బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. వ్యవసాయ పంట పొలాలకు అవసరమైన మందుల కోసం స్నేహితుడు ప్రసాద్‌తో కలిసి అనంతపురం వచ్చారు. అనంతరం ఇద్దరూ బైకుపై స్వగ్రామానికి బయలుదేరారు. రామినేపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డుకు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విత్తన బాల్స్‌పై శిక్షణ
పుట్టపర్తి: ఎల్‌నినోను ఎదుర్కొనే విధంగా పీఎండీఎస్ పద్ధతిలో విత్తన బాల్స్ తయారీపై రైతులకు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం బుక్కపట్నం మండలం గూనిపల్లిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తన బాల్స్ తయారీ, పొలంలో చల్లడంపై శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి నారాయణనాయక్ మాట్లాడుతూ పీఎండీఎస్ పద్ధతిలో సాగు చాలా లాభదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఓ సతీష్‌బాబు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


