దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్టు

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

ధర్మవరం అర్బన్‌: తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న అంతర్‌రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దొంగల అరెస్టు చూపించారు. అనంతరం వన్‌టౌన్‌ సీఐ రెడ్డెప్ప, రూరల్‌ సీఐ ప్రభాకర్‌లతో కలిసి ఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లెల వీరాంజనేయులు అలియాస్‌ వడ్డె రామంజినేయులు గత 25 ఏళ్లుగా చోరీలు చేస్తూ జీవిస్తున్నాడన్నారు. అదే కాలనీకి చెందిన సాకే నరసింహులు, దేవరకొండ విజయ్‌, గుజ్జల నారాయణమ్మ ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకునేవారని చెప్పారు. ద్విచక్ర వాహనంలో రెక్కి నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకునేవారని పేర్కొన్నారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదుగా మార్చుకునేవారన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యేక నిఘాతో దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆటో, రూ.14.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన రూ.17 లక్షల విలువైన 13 తులాల బంగారు నగల రసీదులు, దొంగతనానికి ఉపయోగించిన ఆయుధాలు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.22 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ప్రధాన నిందితుడు అంతఃరాష్ట్ర దొంగ..

ప్రధాన నిందితుడు మల్లెల వీరాంజనేయులుపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ నం.749 కొనసాగుతోంది. 25 ఏళ్లుగా పాత నేరస్తులతో సంబంధాలు కొనసాగిస్తూ వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌, కదిరి, ములకలచెరువు, ఎన్‌పీ కుంట, అనంతపురం వన్‌ టౌన్‌, టూ టౌన్‌, అనంతపురం రూరల్‌, కడప, పులివెందుల, రాయచోటి, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 30 నుంచి 40 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. సాకే నరసింహులుపై రౌడీషీట్‌ ఉందన్నారు. త్వరలో వీరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. దొంగలను అరెస్టు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన రూరల్‌ సీఐ ప్రభాకర్‌, వన్‌టౌన్‌ సీఐ రెడ్డెప్ప, ఎస్‌ఐలు రాజశేఖర్‌, ఉమాదేవి, వీరేష్‌ తదితరులను ఎస్పీ అభినందించారు.

16 కేసుల్లో రూ.14.50 లక్షలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement