ధర్మవరం అర్బన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం డివిజన్‌స్థాయి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే సూచనలు ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో ఆన్‌లైన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. చిన్నపిల్లలు, గర్భిణులకు కచ్చితంగా టీకాలు వేయించాలని, పెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్ వర్క్ అంతా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో జరిగే పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అనుపమ జేమ్స్, జిల్లా మలేరియా నివారణాధికారి చెన్నారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భాగ్యలక్ష్మి, డివిజన్‌లోని వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
అప్పులోళ్ల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దపప్పూరు: అప్పుల వాళ్ల బెదిరింపులు తాళలేక పురుగుల మందుతాగి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పెద్దపప్పూరు మండలంలోని పసలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గురునాథ్, రాజేశ్వరి దంపతులు. గురువారం సాయంత్రం ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు గురునాథ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అయితే పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న రాజేశ్వరిని కొందరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల వాళ్లు బెదిరింపులకు దిగడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది.


