సాక్షి, పుట్టపర్తి
ఇంధన కొరత కారణంగా ప్రత్యేక వాహనాల వాడకం తగ్గించి.. వీలైనంత వరకు ప్రజా రవాణా వినియోగించాలని పాలకులు చెబుతున్నారు. పొదుపు పేరుతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా వారంలో ఒక రోజు కార్లను పక్కన పెడుతున్నారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలోని అధికారులు మాత్రం కార్లను వదలడం లేదు. జిల్లా కార్యాలయంలో పని చేసేవారిలో ఏడుగురు అద్దె వాహనాల్లో తిరుగుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరే బైక్‌పై వెళ్తుంటే...వీళ్లు మాత్రం కారు దర్జా చూపుతున్నారు.
వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే కీలక అధికారులెవరూ స్థానికంగా ఉండటం లేదు. హిందూపురం నుంచి ఒకరు.. అనంతపురం నుంచి ఇంకొకరు.. రోజూ వచ్చిపోతుంటారు. వీరంతా అద్దెకార్లలోనే తిరుగుతున్నారు. ఇక ఇంటి వద్ద నుంచి కార్యాలయం తిరిగేందుకు మరికొందరు కార్లు వాడుతున్నారు. డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, ఎన్‌హెచ్‌ఎం, మలేరియా, ఆరోగ్యశ్రీ, 104, డీఐఓ, డీఎల్‌ఏటీ తదితర అనుబంధ విభాగాలకు కలిపి మొత్తంగా ఏడు అద్దె వాహనాలు తీసుకున్నారు. కొందరు సొంత వాహనాలకే ఎల్లో ప్లేట్ అమర్చి.. అద్దె తీసుకుంటున్నట్లు తెలిసింది. మరో అధికారి మినీ వాహనం (ఐదు సీట్లు) వినియోగిస్తూ.. పెద్ద వాహనం (ఏడు సీట్లు) వాడుతున్నట్లుగా అధిక మొత్తంలో అద్దె డ్రా చేస్తున్నట్లు సమాచారం. ఒకే శాఖలో ఏడుగురు అధికారులకు ప్రభుత్వం అద్దె చెల్లించడం ఏమిటని మిగతా విభాగాల సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
చిన్న కారుకు నెలకు రూ.35 వేలు, పెద్ద వాహనం అయితే రూ.45 వేలు అద్దె వసూలు చేస్తారు. ప్రతి నెలా వైద్య, ఆరోగ్య శాఖకే అద్దె కార్ల రూపంలో ఖజానా నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల కళ్లు కప్పి అద్దె కార్ల దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హిందూపురం నుంచి రోజూ వచ్చి వెళ్లే ఓ అధికారి చిన్న వాహనం వాడుతున్నారు. అయితే పెద్ద వాహనం వినియోగిస్తున్నట్లు బిల్లులు డ్రా చేసినట్లు తెలిసింది. అదేవిధంగా మరో అధికారిణి తన సొంత వాహనం వినియోగిస్తూ.. అద్దె వాహనం వాడుతున్నట్లు ప్రతి నెలా రూ.35 వేలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఏ ప్రభుత్వ శాఖలో ఇన్ని అద్దె కార్లు లేవు.
వైద్య,ఆరోగ్యశాఖ అధి‘కారు’ల దందా
ఒక్క కార్యాలయంలోనే
ఏడుగురికి అద్దె కార్లు
కలెక్టర్, జేసీ మాత్రం
ఇంధన పొదుపు మంత్రం
ఈ–బైక్‌లో కార్యాలయాలకు
వస్తున్న వైనం
డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది మాత్రం కార్లలోనే షికారు
నిబంధనలకు నీళ్లు..
ఈ చిత్రంలో ఈ–బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న వ్యక్తి మన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం ఇలా క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు బైక్‌పై వస్తున్నారు. ఆరోజు ఎక్కడికి వెళ్లినా బైక్‌పైనే వెళ్తున్నారు. జేసీ మౌర్య భరద్వాజ్ కూడా ఆర్టీసీ బస్సులో కలెక్టరేట్‌కు వస్తున్నారు. కానీ వైద్యఆరోగ్యశాఖలోని కొందరు ‘సార్లు’ మాత్రం ‘కార్లు’ లేనిది కాలు బయటపెట్టడం లేదు. ఉద్దరకొస్తోందని అద్దెకార్లలో షికార్లు చేస్తున్నారు.
అధికారులకే బురిడీ..
సార్లు.. స్థానికంగా ఉండరు..


