రైతుల బతుకుల్లో సోలార్‌ మంట | - | Sakshi
Sakshi News home page

రైతుల బతుకుల్లో సోలార్‌ మంట

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

ఎన్‌పీకుంట: సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుతో ఎన్‌పీకుంట మండలంలో సాగుభూమి కరువైంది. ఇప్పటికే వేలాది ఎకరాలు సేకరించిన సర్కార్‌...తాజాగా మరికొమ్మదిన్ని పంచాయతీ జౌకల గ్రామాల్లో మరో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. బుధవారం ‘రామ్‌తరంగ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీ నిర్వాహకులు జౌకల గ్రామంలో ఏకంగా పనులు ప్రారంభానికి భూమిపూజ చేసేందుకు సిద్ధం కాగా, తమ పొలంలో తమకు తెలియకుండా పూజలు ఎలా చేస్తారంటూ రైతులు, గ్రామస్తులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా జీవితాలను నాశనం చేయొద్దు..

ఎవరికో వెలుగులు పంచేందుకు తమ జీవితాలను అంధకారం చేయవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపూజ అడ్డుకున్న అనంతరం పలువురు రైతులు విలేకరులతో మాట్లాడారు. సాగు భూముల్లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే పంటలు ఎలా పండించాలని, పాడి పశువులకు, జీవాలకు మేత ఎలా సమకూర్చాలని ప్రశ్నించారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. మండలం చుట్టూ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటైతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులకు, గ్రామస్తులకు తెలియకుండా 20 రోజుల నుంచి మరికొమ్మదిన్ని పంచాయతీ జౌకల గ్రామంలో పలు కంపెనీల వారు డ్రోన్‌లతో సర్వే నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఏకంగా పనులు ప్రారంభించడం గమనిస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగబోతోందని తెలుస్తోందన్నారు. రైతులకు జీవనాధారమైన సాగు భూముల విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో రైతుల బతుకులను బలిచేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. తమకు తెలియకుండానే తమ భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, సర్కార్‌ తీరుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు పలువురు రైతులు తెలిపారు.

రైతు సమ్మతితోనే భూసేకరణ

మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలో 100 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో భాగంగా డిజిటెక్‌ కంపెనీ వారు డ్రోన్‌ సర్వే పనులను బుధవారం ప్రారంభించారు. రైతులతో గ్రామసభలు ఏర్పాటు చేసి వారి సమ్మతితోనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తాం.

– లక్ష్మమ్మ, తహసీల్దార్‌, ఎన్‌పీకుంట

ఎన్‌పీకుంట మండలంలో

కొత్తగా సోలార్‌ పవర్‌ప్లాంట్‌

ఇప్పటికే జౌకల గ్రామంలో డ్రోన్‌ సర్వే

తాజాగా పనుల ప్రారంభానికి

రైతుల భూముల్లో పూజలు

అడ్డుకున్న రైతులు.. జీవనాధారం కోల్పోతామని ఆందోళన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement