‘యాప్‌’రే.. ఇన్ని ప్రయోజనాలా! | - | Sakshi
Sakshi News home page

‘యాప్‌’రే.. ఇన్ని ప్రయోజనాలా!

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

కదిరి: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్‌)తో జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అది హాట్‌ టాపిక్‌గా మారింది. బస్సులో వెళ్తున్నా..టీ కొట్టుకో కూర్చున్నా.. రచ్చబండ దగ్గరకు వెళ్లినా..ఎక్కడ నలుగురు గుమికూడినా, ఏ నోట విన్నా ఇప్పుడు ‘సర్‌’ అనే మాటే వినబడుతోంది. వారి మాటల్లో ప్రధానంగా విన్పిస్తున్నదేంటంటే ‘ఓటరు లిస్ట్‌లో నా పేరు ఉందో? లేదో..?. నా ఓటరు ఐడీ నెంబర్‌ ఎంతో తెలీదు..నా ఓటరు కార్డు పోయింది.. మా ఇంట్లో వాళ్ల ఓట్లు ఉన్నాయో..లేదో! కొత్తగా ఓట్లు ఎలా ఎక్కించు కోవాలి?. మా బీఎల్‌ఓ ఎవరో తెలీదు..మా పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ ఎంత?..ఓటరు ఐడీ కార్డు ఎవరు ఇస్తారు? ఓటుకు సంబందించి ఎవరిని కలవాలి?’ అనే ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ‘ఈసీఐనెట్‌’ అనే మొబైల్‌ యాప్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఎవరినీ సంప్రదించకుండానే ఎన్నికల సమాచారం మొత్తం అరచేతిలోనే ఉంది.

బహుళ ప్రయోజనాలు...

ఓటరు హెల్ప్‌ లైన్‌ యాప్‌, సీ–విజిల్‌, ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌, నో యువర్‌ క్యాండిడెట్‌, ఈసీఐ స్వీప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌, సీ విజిల్‌ పోర్టల్‌, సర్వీస్‌ ఓటర్‌ పోర్టల్‌ తదితర 40 రకాల యాప్‌లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పని చేసేవి. వాటి పనితీరు సరిగా లేనందున వీటికి సరైన ప్రజాదరణ లభించలేదు. అధికారుల కోసం రూపొందించిన ఈఆర్‌ఓనెట్‌, బీఎల్‌ఓ యాప్‌, అబ్జర్వర్‌ యాప్‌, సువిధవంటి మొబైల్‌ యాప్‌లు కూడా అంతగా సత్పలితాలు ఇవ్వలేదు. అందుకే వాటన్నింటికీ చెల్లుచీటీ పలుకుతూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది మే నెలలో ప్రయోగాత్మకంగా 40 యాప్‌లను అనుసంధానం చేస్తూ ‘ఈసీఐనెట్‌’ అనే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు ఈ యాప్‌ ద్వారా ప్రజలకు అధికారిక సమాచారం అందింది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఈ యాప్‌ను ఈ యేడాది జనవరిలో అధికారికంగా ఆవిష్కరించింది. ఇందులో ఓటర్ల జాబితాలో పేరు, ఓటరు గుర్తింపు కార్డును శోధించవచ్చు. ఓటరు నమోదు, గుర్తింపు కార్డుల రద్దు, సవరణ, బదిలీ, వంటి దరఖాస్తులు కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ఓటరు కార్డులను కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గతంలో అంటే 2002లో ఎస్‌ఐఆర్‌ జరిగినప్పుడు ఆ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో,లేదో కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారానే బీఎల్‌ఓ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకొని సమస్యను చెప్పవచ్చు. లేదంటే మెసేజ్‌ రూపంలో తెలియజేయవచ్చు.

నాటి నుంచి సమాచారం..

1951–52 నుంచి జరిగిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ల నుంచి ఇటీవలి ఎన్నికల వరకూ రాష్ట్రాల వారీగా ఎన్నికల వివరాలన్నీ ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్‌ శాతం తెలుసుకోవాలంటే మరుసటి దినం వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ‘ఈసీఐనెట్‌’ యాప్‌ ద్వారా పోలింగ్‌ వివరాలతో పాటు కౌంటింగ్‌ వివరాలను సైతం ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా రిగ్గింగ్‌ వంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ యాప్‌ ద్వారానే ఎన్నికల కమిషన్‌కు వెంటనే ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మొబైల్‌లో ప్లేస్టోర్‌ లోకి వెళ్లి ‘ఈసీఐనెట్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆ సేవలను పొందండి.

అన్ని వివరాలకు

‘ఈసీఐనెట్‌’ మొబైల్‌ యాప్‌

సులువుగా ఓటరు దరఖాస్తులు,

కార్డుల డౌన్‌లోడ్‌

నిమిషాల్లో పోలింగ్‌,

ఓట్ల లెక్కింపు వివరాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement