పుట్టపర్తి అర్బన్: ‘నవచేతన’ యాప్‌పై శిక్షణ పేరుతో తమకు శిక్ష వేశారని పలువురు అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ రోజు భోజనాలు, టీ, స్నాక్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును అధికారులు తమ ఖాతాలకు వేసుకున్నారంటున్నారు.
రూ.50 వేలు మంజూరైనా...
ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నవచేతన యాప్‌పై శిక్షణ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మండలంలోని ఏదో ఒక కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ఒక్కో కార్యకర్తకు రూ.250 మంజూరు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే పుట్టపర్తి ప్రాజెక్టులోని పుట్టపర్తి రూరల్, మున్సిపాలిటీ, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు ఉన్నాయి. ఇందులో 203 మంది కార్యకర్తలు ఉన్నారు. వీరంతా ఈనెల 5, 6, 8 తేదీల్లో శిక్షణకు హాజరయ్యారు. అయితే శిక్షణ రోజు ప్రతి కార్యకర్తకూ, వైద్య సిబ్బందికి భోజనం అందించాల్సి ఉంది, శిక్షణ కేంద్రాలకు వచ్చిన సందర్భంగా వారికి చార్జీలు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే ఇవేవీ లేకుండానే సంబంధిత సీడీపీఓ శిక్షణ ముగించారు. భోజనం అడిగిన కార్యకర్తలను విజిట్ పేరుతో ఇబ్బంది పెట్టినట్లు బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల కార్యకర్తలు ప్రాజెక్టు డైరెక్టర్‌కు, సంఘ నాయకులకు పిర్యాదు చేశారు. కొత్తచెరువు ,బుక్కపట్నం మండలాలకు చెందిన వర్కర్లకు సుదూర ప్రాంతాల్లో కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి కనీసం భోజనాలు, టీ, స్నాక్స్ అందించకుండా కడుపు మార్చారని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. రూ.50 వేలకు పైగా బిల్లు మంజూరైనా అంతా సీడీపీఓ ఖాతాలో వేసుకున్నారంటున్నారు. శిక్షణ సమయంలోనే బిల్లులు చెల్లించినట్లు, భోజనం, టీ, స్నాక్స్ ఇచ్చినట్లు సంతకాలు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి తమను ఆకలితో మాడ్చిన సీడీపీఓపై చర్యలు తసుకోవాలని బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల కార్యకర్తలు కోరుతున్నారు.
ఆకలితో అలమటించిన
అంగన్‌వాడీ కార్యకర్తలు
డైరెక్టర్ ఆదేశాలు పాటించని సీడీపీఓ


