కక్ష కట్టి.. కష్టాల్లోకి నెట్టి | - | Sakshi
Sakshi News home page

కక్ష కట్టి.. కష్టాల్లోకి నెట్టి

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

పుట్టపర్తి అర్బన్‌: వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ‘తాత్కాలిక’ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. సిబ్బందిని తొలగించే కుట్ర పన్నుతోంది. ఇటీవల సహకార సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారిని ఉంచుకోవడం ఇష్టం లేని ప్రభుత్వం జూన్‌ నుంచి వేతనాలను ఆపింది. దీంతో చిరుజీవులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక సొసైటీల్లో చేరి కంప్యూటర్‌ పని, రుణాల వసూళ్లు, రికార్డు వర్క్‌ చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న తమపై ఇంత చిన్నచూపా అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంద మందిపై వేటు!

2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకూ పనిచేసిన సిబ్బందిని తొలగించి టీడీపీ కార్యకర్తలు, వారి సంబంధీకులను చేర్చుకున్నారు. సహకార సంఘాల్లో అధ్యక్షులను మార్పు చేసిన వెంటనే తాత్కాలిక సిబ్బందిలో భారీ మార్పులు చేశారు. 2019లో వచ్చిన వారంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ ఉన్నపళంగా తొలగించారు. వారి స్థానంలో ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేసుకున్న నాయకులు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారంతా ఉద్యోగంలో చేరి ఏడాది కూడా పూర్తి కాకుండానే తొలగించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. సాధారణంగా సొసైటీలో ఒక సీఈఓ, ఒక క్లర్క్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఒక అటెండర్‌ ఉంటారు. అయితే టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ఒక్కో సొసైటీలో ఇద్దరు నుంచి నలుగురిని చేర్చారు. ప్రస్తుతం వారందరికీ జూన్‌ నెల వేతనాలు ఆపారు. సిబ్బంది సంఖ్య అధికం కావడంతో సొసైటీ నష్టాల బాటపడుతోందని,వారిని తొలగిస్తే లాభాల్లోకి రావొచ్చని జిల్లా నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది.

‘సహకార’ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు

2019 తర్వాత సొసైటీల్లో చేరిన వారిని తొలగించే కుట్ర

జీతాలు నిలిపేయడంతో

లబోదిబోమంటున్న సిబ్బంది

త్వరలో నిరసనలు

జిల్లాలో 54 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో ఇటీవల 100 మందికి పైగా ఉద్యోగాల్లో చేరారు. వారందరికీ నెలకు రూ.15 వేల వరకూ వేతనాలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాది పాటు నెలనెలా వేతనాలు అందుకున్నారు. ఇక వేతనాలు రావని తెలిసి ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం పుట్టపర్తిలోని సీపీఎం కార్యాలయంలో సీపీఎం నాయకులను కలిసి సమస్యను తెలియజేశారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటించి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement