ఎన్‌పీకుంట: మండల పరిధిలోని గురికానివారిపల్లి గ్రామంలో గత నెలన్నర రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ బోరు మోటరు మరమ్మతులకు గురయ్యిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు పైగా ఉన్నారని, దాహార్తి తీర్చుకోవడం కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించి, బిందెలతో నీరు మోసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అధికారులు స్పందించి బోరు మోటరుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.
ధర్మవరం వన్ టౌన్, టూటౌన్‌కు కొత్త సీఐలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం వన్ టౌన్ సీఐగా రెడ్డెప్ప, టూ టౌన్ సీఐగా జయానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టౌన్ సీఐగా ఉన్న నాగేంద్రప్రసాద్ గుంతకల్లు రైల్వే సీఐగా బదిలీపై వెళ్లడంతో టూ టౌన్ సీఐగా ఉన్న రెడ్డెప్పను వన్‌టౌన్ సీఐగా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఐగా ఉన్న జయానాయక్‌ను టూ టౌన్ సీఐగా నియమించారు.
కాలువ పూడ్చివేత పనులు అడ్డగింత
చిలమత్తూరు: పెన్నానది నుంచి మండల పరిధిలోని చౌళూరు చెరువు వరకూ ఉన్న ఉప కాలువను కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు పూడ్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా చౌళూరు గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనాదిగా ఉన్న కాలువను పూడ్చి వేసి చౌళూరు చెరువుకు వస్తున్న నీటిని అడ్డుకునేందుకు యత్నించడం దుర్మార్గమన్నారు. అధికారులు కాలువను పూడ్చివేయకుండా తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ సర్పంచ్‌లు లోకేష్‌రెడ్డి, నంజప్ప, రాజు, శివ, సురేష్, చంద్రప్ప, ప్రకాష్, వాసు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి,
నకిలీ నోట్ల పట్టివేత
● ఇద్దరి అరెస్టు
గుత్తి: గంజాయితో పాటు నకిలీ నోట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్ ఖాన్ తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామా నికి చెందిన సి.గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి బైక్‌లో గంజాయి, నకిలీ నోట్లు తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలోనే గుత్తి అనంత పురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్ ఖాన్‌లు వారిని పట్టుకున్నారు. బైక్‌లో ఉన్న 20 గ్రాముల గంజాయి, 47 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుత్తికి చెందిన రమేష్‌కు గంజాయి, నకిలీ నోట్లు ఇచ్చి కేసులో ఇరికించాలని నిందితులు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.
ఇంట్లో బంగారు నగల అపహరణ
● 6 నెలల తర్వాత పోలీసులకు
ఫిర్యాదు చేసిన బాధితులు
అనంతపురం సెంట్రల్: ఇంట్లో బంగారు నగ లను అపహరించిన ఘటన నగరంలోని కోవూరునగర్‌లో జరిగింది. 6 నెలల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నాల్గో పట్టణ ఎస్‌ఐ కె.గోపి తెలిపిన మేరకు.. గతేడాది డిసెంబర్‌లో కోవూరునగర్‌లో నివాసముంటున్న మహబూబ్‌బాషా నివాసంలో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 13.5 తులాల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని బాధితులు మంగళవారం నాల్గవ పట్టణ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.


