మడకశిర రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన మడకశిర మండలంలోని తడకలపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన గంగరాజు కుమారుడు మహేంద్ర (24), అతని బావ, రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ఆదినారాయణ (28)తో పాటు మరో యువకుడు ఆదివారం కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో తడకలపల్లి వద్ద 544–ఈ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్ర, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలైన మరో యువకుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణకు భార్య మమత, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మడకశిర మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బావ, బావమరిది మృతితో క్యాంపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


