సందర్భం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

సందర్భం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుబ్రమణ్యం. హిందూపురం పట్టణానికి చెందిన ఈయన ఇప్పటి వరకు 86 సార్లు రక్తదానం చేశారు. ‘ఓ పాజిటివ్‌’ రక్తం కలిగిన ఈయన యువకుడిగా ఉన్నప్పటి నుంచి రక్తదానం చేస్తున్నారు. ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవంతో పాటు ఎవరికై నా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని తరచూ రక్తం అందజేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాతలు

ఆపదలో రక్తమిచ్చి

ప్రాణం పోస్తున్న వైనం

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

హిందూపురం టౌన్‌: కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తున్న ఈ రోజుల్లో మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఆపదలో రక్తదానం చేసి పరోక్షంగా ప్రాణం పోస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్‌ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

అన్ని దానాల్లోకెల్లా మిన్న

అన్నదానం చేస్తే ఒక్క పూట కడుపు నిండుతుంది. అదే రక్తదానం చేస్తే ఒక ప్రాణం నిలబడుతుంది. ఒకప్పుడు రక్తదానం చేస్తే నీరసించిపోతారని, పాడైపోతారనే అపోహలు ప్రజల్లో ఉండేవి. రక్తదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోరాదు. మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. మన శరీరం నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. అందువల్ల ఎటువంటి హాని కలగదు. రక్తదాన సమయంలో కేవలం శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేకపోయారు. రక్తాన్ని కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే సేకరించగలుగుతున్నారు. రక్తం అందుబాటులో లేక పలువురు ప్రాణాపాయస్థితిని ఎదుర్కొంటున్నారు. రక్తం లభ్యమైన సందర్భాల్లో కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

స్వచ్ఛందంగా ముందుకు

ఆపద సమయంలో అయిన వారికి కూడా రక్తదానం చేసేందుకు భయపడుతున్న ప్రస్తుతం కాలంలో తామున్నామంటూ రక్తదాతలు ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంతో స్వయంగా గుర్తిస్తున్నారు. హిందూపురంలో 15 స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూపులుగా ఏర్పడి రక్తదానం చేస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా హిందూపురం, కదిరి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండగా, ధర్మవరం, పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శ్రీసత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలోనూ బ్లడ్‌ బ్యాంక్‌ ఉంది. దాతల నుంచి రక్తం సేకరించడమే కాకుండా, జిల్లా వ్యాప్తంగా వివిధ చోట్ల బ్లడ్‌ బ్యాంక్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి రక్తం సేకరిస్తున్నారు. అదేవిధంగా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలోనూ రక్తసేకరణ జరుగు తోంది. హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మొబైల్‌ వాహనం ద్వారా కూడా రక్త సేకరణ జరుగుతోంది. సేకరించిన రక్తాన్ని అన్ని విధాలా పరీక్షలు జరిపి, గర్భిణులకు, ప్రసవాల సమయాల్లో, తలసేమియా బాధితులకు, ప్రమాదాల సమయంలో క్షతగాత్రల కోసం ఉపయోగిస్తున్నారు. హిందూపురంలో దాదాపు 1,250 యూనిట్ల నిల్వ సామర్థ్యం ఉంది. ఎర్రరక్త కణాలతో పాటు, ఎఫ్‌ఎఫ్‌పీ (ఫ్రెష్‌ ఫ్రోజెన్‌ ప్లాస్మా) స్టోరేజ్‌, ప్లేట్‌లెట్స్‌ స్టోరీ సామర్థ్యం కలిగి ఉంది. గత సంవత్సరం హిందూపురం బ్లడ్‌ బ్యాంకు ద్వారా 3,739 రక్త యూనిట్లను సేకరించారు. ప్రస్తుతం ఇక్కడ 300కుపైగానే యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement