హిందూపురం: నిత్యం చెస్ ఆడడం ద్వారా మేధస్సు పెరుగుతుందని హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ నాగూరు రెడ్డి బాష అన్నారు. హిందూపురం శ్రీవాసవి ధర్మశాలలో శనివారం రాష్ట్ర స్థాయి పోస్టల్ ఉద్యోగుల చెస్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సాగే చెస్ ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు విజయవాడ, కాకినాడ, అమలాపురం, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, వేలూరు తదితర జిల్లాల నుంచి 30 మంది హాజరైనట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ హుస్సేన్‌ఖాన్, నేషనల్ ఆర్బిటర్ సాయి చరణ్ పర్యవేక్షణలో ఎంపిక చేస్తున్నామన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన 5 మంది ఏపీ పోస్టల్ సర్కిల్ తరఫున గుజరాత్‌లో ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సహాయ సూపరింటెండెంట్ పార్వతి, ఇన్‌స్పెక్టర్ విమల్ కుమార్, పోస్ట్‌మాస్టర్ మార్కండేయ పాల్గొన్నారు.
ఆటోను ఢీకొన్న కారు.. వృద్ధురాలి దుర్మరణం
● మరో ముగ్గురికి గాయాలు
పుట్టపర్తి: ఆటోను కారు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలు దుర్మరణం పాలైంది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. శనివారం ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం మండలం గూనిపల్లికి నలుగురు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. గరుగుతండా వద్ద వెళ్తున్న సమయంలో బుక్కపట్నం వైపు నుంచి ముదిగుబ్బ వైపు వెళ్తున్న కారు ఆటోను ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు పక్కన గుంతలో పడడంతో అందులో ప్రయాణిస్తున్న బెస్త గంగమ్మ (70)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తక్కిన ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కాగా, స్థానికులు వెంటనే సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలి కుమారుడు గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి చెప్పారు.
మహిళ అదృశ్యం
ధర్మవరం అర్బన్: పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహిళ అదృశ్యమైనట్లు భర్త ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. లక్ష్మీనగర్‌కు చెందిన ఎర్రజోడు లీలావతి శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువులు, తెలిసిన వారి వద్ద ఆమె భర్త విచారించారు. ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


