సాక్షి, పుట్టపర్తి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజల నమ్మకాన్ని, ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై పెనుకొండలో ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం సర్కిల్ వరకు సాగిన ర్యాలీకి వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. అన్నదాత ఆక్రందనలు ఆలకించే నాథుడే లేరన్నారు. నిరుద్యోగులను రోడ్డుకు లాగేశారని, ఏటా డీఎస్సీ ఇస్తామని దగా చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక వాటిని బుట్ట దాఖలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ధర్మవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు నార్పల సత్యనారాయణరెడ్డి విమర్శించారు. కేతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. స్థానిక ఎస్‌బీఐ కాలనీ నుంచి కాలేజ్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్‌టీ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడారు.
నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కదిరి పట్టణంలో కదం తొక్కారు. సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ మైదానం నుంచి కాలేజీ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్, జీవిమాను సర్కిల్ మీదుగా నానా దర్గా వరకు ఫ్ల్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ చేశారు. మక్బూల్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను దారణంగా మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
రాష్ట్రంలో రెండేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. మడకశిరలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
పెనుకొండలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులతో బుక్కపట్నం జనసంద్రంలా మారింది. వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుక్కపట్నం మరవ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి స్థానిక తేరు బజార్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ సాగింది. తేరు బజారు సర్కిల్‌లో బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రెస్ చంద్రబాబు అన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న చంద్రబాబుకు ప్రజలకు వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్క కాదన్నారు. 2014లో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని నిలువునా మోసం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో 2024లో సూపర్ సిక్స్ హామీలు గుప్పించి.. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
ఎగిసిన నిరసన కెరటం
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ మహా నిరసన కెరటంలా ఎగసిపడింది. అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి జాతీయ రహదారి–44 వరకు వేలాదిమందితో ర్యాలీ సాగింది. రోడ్డు పొడవునా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన వంచనను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చివరకు డ్వాక్రా సంఘాలే లేకుండా చేస్తున్నారని చంద్రబాబుపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
భారీ నిరసన ర్యాలీలు
స్వచ్ఛందంగా తరలివచ్చిన
వేలాది మంది ప్రజలు
బాబు ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహం
చంద్రబాబు సర్కారుకు కౌంట్‌డౌన్ మొదలు
హోరెత్తిన మడకశిర
చంద్రబాబు విద్రోహ పాలనపై జనం విరుచుకుపడ్డారు. చేతగాని సీఎం దిగిపోవాలని నినదించారు. మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. ‘ఇది ప్రజల ప్రభుత్వం కాదు.. ప్రచార ప్రభుత్వం.. వెన్నుపోటు సర్కారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల మోసపూరిత పాలనపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినోత్సవం’ జిల్లా వ్యాప్తంగా విజయవంతం అయ్యింది. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీటికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు.
చంద్రబాబు సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందని వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. హిందూపురంలో దీపిక ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినోత్సవం’ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి గురునాథ్ సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం అని అర్హులకు కూడా అన్యాయం చేశారని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 అని ఇప్పటి వరకూ దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. డీఎస్సీ పేరుతో అడ్డగోలు నియామకాలు చేపట్టి నారా లోకేశ్ జేబులు నింపుకొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కదిరిలో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు


