అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

సాక్షి, పుట్టపర్తి: హైటెక్‌ యుగంలో మోసాలు కూడా సరికొత్తగా చేస్తున్నారు కొందరు దుండగులు. అమాయకులను టార్గెట్‌ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో కొందరు, అధిక వడ్డీ ఆశ చూపి మరికొందరిని ట్రాప్‌ చేసి అందినకాడికి దోచేస్తున్నారు. వ్యాపారం పేరుతో భారీ రాయితీలు ప్రకటించడం, ఖరీదైన వస్తువులు తక్కువ ధరకే వస్తాయని, సగం ధరకే భూమి దొరుకుతోందని ఇలా అవతలివారిని నమ్మిస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు.

కారులో ఖరీదైన దుస్తులతో వచ్చి...

అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు కారులో తిరుగుతూ ఖరీదైన దుస్తులు ధరించి ముందుగానే డబ్బులు ఖర్చు చేస్తారు. ఒకట్రెండు రోజులు గడిచిన తర్వాత అవతలి వ్యక్తి వద్ద ఉన్న డబ్బుల గురించి ఆరా తీసి.. ఏదో మార్గంలో లాగేయాలని చూస్తారు. ఆ వ్యక్తికి ఏది అవసరమో ఆ పని మీద దృష్టి సారించి.. ఒక్క రోజులో పని పూర్తి చేస్తామని.. కాకపోతే ఖర్చు అవుతుందని నమ్మిస్తారు. సదరు వ్యక్తి డబ్బు తెచ్చి ఇవ్వగానే.. ఒకట్రెండు రోజుల పాటు అధికారి లేరని చెబుతూ ఆ తర్వాత పరారవుతారు. మధ్యవర్తిత్వం చేసిన వారిని ప్రశ్నిస్తున్నా వారు కూడా.. ఆయన అందుబాటులో లేడని.. తనను కూడా మోసం చేశాడని దబాయించి మోసాలకు పాల్పడుతున్నారు.

భూ విక్రయాలతో భారీ దందా

ఒకే భూమిని ఇద్దరు.. ముగ్గురికి అమ్మి మోసాలకు పాల్పడటం.. సబ్‌ డివిజన్‌ కాని భూములను విక్రయించి తగాదాలు సృష్టించి.. డబ్బులు దండుకుని పరారవుతున్న కేసులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో దిగాలని నమ్మబలికి వివాదాల్లో ఉన్న భూములను అమ్మి.. సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పుట్టపర్తిలో ఇటీవల కాలంలో వెలుగు చూశాయి.

లోన్లు ఇప్పిస్తామని.. కార్లు కొనిస్తామని..

బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామని ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌ చేయడం.. అమాయకుల నుంచి డబ్బులు లాక్కున్న ఘటనలు వెలుగు చూశాయి. అలాగే తక్కువ ధరకే కారు దొరుకుతుందని డబ్బులు వసూలు చేసి కారు కట్టబెడుతారు. అయితే నెలల తిరిగే లోపు యజమానులు వచ్చి కారు తమదేనంటూ దబాయిస్తారు. దొంగ సరుకు.. దోపిడీల్లో తెచ్చిన బంగారం అమ్మి.. జేబులు నింపుకుంటున్నారు. పుట్టపర్తిలో అద్దె ఇంట్లో ఉంటూనే.. ఆ ఇల్లు తమదేనంటూ నమ్మబలికి పలువురితో అప్పు తీసుకుని పరారీ అయిన వ్యక్తులు కూడా కోకొల్లలు ఉన్నారు.

అమాయకులే లక్ష్యంగా దొంగాట

ఉద్యోగాలు, అధిక వడ్డీ, రాయితీలంటూ వల

ట్రాప్‌లో చిక్కుంచుకొని రూ.లక్షల వసూలు

పోలీసుస్టేషన్ల చుట్టూ బాధితుల ప్రదక్షిణ

జిల్లాలో రోజుకో చోట వెలుగు చూస్త్తున్న నేరాలు

ఎవరైనా అధిక వడ్డీ ఆశ చూపితే మోసపోవద్దు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను ప్రైవేటు వ్యక్తులు ఇవ్వరనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వ్యాపారం చేయాలంటే తెలిసిన వాళ్లతోనే మాట్లాడండి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడుల గురించి రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ కార్యాలయాల్లో సంప్రదించిన తర్వాతనే కొనుగోలు చేస్తే మంచిది.

– ఎస్‌.సతీశ్‌కుమార్‌, పుట్టపర్తి, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement