నేను పేరుకే ఆర్‌ఎంపీ.. అవసరమైతే ఇక్కడే సర్జరీ కూడా చేస్తా..! | - | Sakshi
Sakshi News home page

నేను పేరుకే ఆర్‌ఎంపీ.. అవసరమైతే ఇక్కడే సర్జరీ కూడా చేస్తా..!

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

● ఓడీ చెరువులోని ఓ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఈ నెల 22న తనిఖీ చేశారు. అనుమతులు, అర్హత లేదని తేలడంతో సీజ్‌ చేశారు. అదే రోజున గోరంట్లలోనూ పలు క్లినిక్‌లను తనిఖీ చేశారు. దీంతో నాలుగైదు రోజులుగా జిల్లాలో చాలా క్లినిక్‌లను నిర్వాహకులు మూసివేశారు. కలెక్టర్‌ తనిఖీలకు వస్తే ఇరుక్కుంటామని క్లినిక్‌ బంద్‌ చేసినట్లు తెలిసింది.

● గతేడాది డిసెంబరులో ఎన్‌పీకుంటకు చెందిన మెకానిక్‌ రామచంద్ర జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆర్‌ఎంపీ క్లినిక్‌కు వెళ్లగా.. ఆర్‌ఎంపీ బాలాజీ ఇంజక్షన్‌ చేశాడు. ఆ వెంటనే రామచంద్ర శరీరంపై గడ్డలు ఏర్పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు హుటాహుటిన బెంగళూరుకు తీసుకెళ్లారు. అర్హత లేని డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పట్లో స్థానికులు డిమాండ్‌ చేశారు.

సాక్షి, పుట్టపర్తి

ర్హులు కారు... అనుమతులు ఉండవు.. అయినా ఊరూరా రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ (ఆర్‌ఎంపీ) క్లినిక్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే సకాలంలో వైద్యం అందదు... ప్రైవేటుకు వెళ్లి చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేని పేదలు గత్యంతరం లేక స్థానికంగా ఉన్న క్లినిక్‌కు వెళ్తున్నారు. అయితే అక్కడే అర్హత లేని ఆర్‌ఎంపీలు వైద్యం చేసేస్తున్నారు. ఇంజక్షన్‌ వేయడం, సైలెన్‌ పెట్టడం లాంటి వైద్యసేవలు చేస్తూ భారీగానే దండుకుంటున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ఏకంగా ల్యాబ్‌, ఫార్మసీలు కూడా ఏర్పాటు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తెలిసీ తెలియక వారు చేసే వైద్యం ఒక్కోసారి వికటించి రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇలా చిన్నారులు, బాలింతలు ఇబ్బందులకు గురై మరో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందిన దాఖలాలు జిల్లాలో చాలానే వెలుగు చూశాయి. అన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే.

ఇచ్చిందే మందు.. చేసిందే వైద్యం..

గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు క్లినిక్‌లు భారీగా వెలిశాయి. అక్కడ ల్యాబ్‌, సైలెన్‌ బాటిల్‌ ఎక్కించడం, మందులు రాసి ఇవ్వడం, ఇంజక్షన్‌ చేయడం, మందుల పంపిణీ.. ఇలా అన్నింటికీ ఒకరే వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎంపీ డాక్టరే సర్వాధికారి. ఆయన ఇచ్చిందే మందు.. చేసినదే వైద్యం అన్న చందంగా మారింది. వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడో ఒక చోట వైద్యుడికి అసిస్టెంట్‌గా పనిచేయడం..ఆ తర్వాత సొంతంగా క్లినిక్‌ ఏర్పాటు చేసుకుని ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. సమీప పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులతో కుమ్మకై ్క ఇక్కడి నుంచి రోగులను పంపిస్తారు. ఫీజులో కొంత పర్సెంటేజీ కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

ఔషధంతోనూ ఆటలు..

ఆర్‌ఎంపీ క్లినిక్‌లతో పాటు చాలా చోట్ల మెడికల్‌ షాపులు కూడా అర్హత లేని వారు నిర్వహిస్తున్నారు. అనుమతులు ఒకరి పేరు మీద తీసుకుని.. మరొకరు నిర్వహిస్తున్న దాఖలాలు ప్రతి చోట వెలుగు చూస్తున్నాయి. ఎలాంటి రశీదు లేకుండానే మందులు ఇచ్చేస్తారు. తామే డాక్టర్‌ అనే తరహాలో రోగులు అడిగిన వెంటనే చేతికందిన మందులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. హిందూపురంలోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఎప్పుడూ మూతపడే ఉంటుంది. దీంతో పర్యవేక్షించే వారు లేకపోవడంతో మెడికల్‌ షాపు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆర్‌ఎంపీ వైద్యం..

యంత్రాంగం చోద్యం

అర్హత లేకున్నా క్లినిక్‌లు

నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలు

అనుమతుల్లేకుండానే

పలు ఆస్పత్రుల్లో ల్యాబ్‌, ఫార్మసీలు

ఉత్తుత్తి పరీక్షలు చేస్తూ..

జేబులు నింపుకొంటున్న వైనం

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న

వైద్యారోగ్యశాఖ

ఓడీ చెరువులో ఓ క్లినిక్‌ను సీజ్‌ చేసిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

నిబంధనలు పాటించాల్సిందే

రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లంతా (ఆర్‌ఎంపీ) నిబంధనలు పాటించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తాం. నిబంధనలు పాటించని క్లినిక్‌లను సీజ్‌ చేస్తాం. ఆయా డాక్టర్లపై కేసు నమోదుకు సిఫారసు చేస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు ఉన్నారు. రోగులందరూ ప్రభుత్వాస్పత్రులనే ఆశ్రయించండి. ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిబంధనల మేరకు మాత్రమే వైద్యం చేయాలి. అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే.. చర్యలు తప్పవు.

– ఫైరోజాబేగం,

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి

Advertisement
 
Advertisement
Advertisement