హిందూపురం: మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు న్యాయవాదులపై అక్రమంగా నమోదు చేసిన కేసును బేషరత్తుగా ఎత్తి వేయాలంటూ హిందూపురం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. న్యాయవాదులు ఉదయ్ సింహారెడ్డి, యూసఫ్‌పై మంగళవారం రాత్రి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను బార్ అసోసియేషన్ ఖండించింది. బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ... మున్సిపల్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడమే తరువాయి అన్నట్లు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేయడం తగదన్నారు. నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. న్యాయవాదులతో పాటు అక్కడి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా న్యాయవాదులపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ అంశాలపై నిష్పక్షపాతంగా వ్యవహారించకపోతే న్యాయవాదులందరూ ఐక్యంగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


