చెన్నేకొత్తపల్లి: విద్యుత్ షాక్‌కు గురై చెన్నేకొత్తపల్లి మండలం పల్లెన్నగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి (42) మృతి చెందాడు. తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం ఉదయం చెన్నేకొత్తపల్లిలోనే ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు ఓ కుమారుడు, భార్య సరోజ ఉన్నారు. రెండు నెలల క్రితమే భార్యకు డెలివరీ అయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
కదిరి టౌన్: యువకుడిని మోసం చేసిన కదిరికి చెందిన నవయుగ బుక్‌స్టాల్ యజమాని కుమారుడు కురవ నవదీప్‌తో పాటు ఇదే పట్టణానికి చెందిన కమల్‌బాషాపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక కాలేజీ సర్కిల్‌లో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న జాగల రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రవీంద్ర కుమారుడు శ్రీనిత్ వద్ద నుంచి నవదీప్, కమల్‌బాషా 30 గ్రాముల బంగారు గొలుసు తీసుకుని ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారని, గొలుసు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగారంటూ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడని వివరించారు.
బైక్ కొనివ్వలేదని...
రైలు కింద పడ్డాడు!
తాడిపత్రి రూరల్: తాను కోరుకున్న ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్న నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్ (21) టైల్స్ పరిచే పనులకు వెళుతూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తనకు ఓ ద్విచక్ర వాహనం కొనివ్వాలంటూ వారం రోజులుగా తల్లిదండ్రులను అభ్యర్థిస్తూ వచ్చాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, కాస్త కుదుట పడగానే బైక్ కొందామంటూ తల్లిదండ్రులు నచ్చచెబుతూ వచ్చేవారు. అయితే బైక్ కొనాలన్న తన ఆకాంక్ష ఎన్నటికీ నెరవేరదని భావించిన సాయికిరణ్ క్షణికావేశంలో ఆదివారం రాత్రి తాడిపత్రి – చల్లవారిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మార్గంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సోమవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా మృతుడిని సాయికిరణ్‌గా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు.


