బత్తలపల్లి: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాసినేని తరుణ్‌చౌదరి, సాయితేజ (కదిరి), వేములేటి వినయ్‌కుమార్‌రెడ్డి (పెనుకొండలోని అల్విన్ కాలనీ), పోలా యశ్వంత్‌రెడ్డి (కడపలోని మారుతీనగర్) నలుగురూ ఎస్‌వీఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. మంచి స్నేహితులు. ధర్మవరంలో నివాసముంటున్న తమ బంధువుల ఇంట వివాహ వేడుక ఉండడంతో తరుణ్ చౌదరి తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. వివాహ వేడుక అనంతరం ఊరేగింపునకు కావాల్సిన ఆదివారం రాత్రి అనంతపురానికి వెళ్లారు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని కారులో తిరుగు ప్రయాణమైన నలుగురు స్నేహితులు.. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్దకు చేరుకోగానే డ్రైవింగ్ చేస్తున్న వినయ్‌కుమార్‌రెడ్డి నిద్రలో జోగడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో సాయితేజ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురూ గాయాలతో బయటపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


