పౌర సరఫరాలు అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

పౌర సరఫరాలు అస్తవ్యస్తం

Jul 31 2025 7:26 AM | Updated on Jul 31 2025 9:12 AM

పౌర స

పౌర సరఫరాలు అస్తవ్యస్తం

ప్రశాంతి నిలయం: జిల్లాలో విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో పౌరసరఫరాల పంపిణీలో అక్రమాలు తారస్థాయికి చేరుకున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 2024, అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకూ ప్రభుత్వం పంపిణీ చేసిన చౌక బియ్యం అక్రమ రవాణా, నిల్వలకు సంబంధించి 23 కేసులు నమోదు కాగా, ఇందులో రూ.21.78 లక్షల విలువ చేసే 876 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. ఇక అధికారుల కళ్లు కప్పి రోజూ పొరుగు రాష్ట్రాలకు టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యం రాచమార్గంలోనే తరలిపోతోంది. ఈ అక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకునే విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో పౌరసరఫరాల వ్యవస్థ నిర్వీర్యమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం..

జిల్లా వ్యాప్తంగా 5,67,118 రేషన్‌ కార్డులుండగా.. వీరిలో చాలా మందికి రేషన్‌ సక్రమంగా అందడం లేదు. రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరితోపాటు అంగన్‌వాడీ పాఠశాల ద్వారా చిన్నారులకు, బాలింతలు, గర్బిణులకు పౌష్టికాహారం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి బియ్యంతో పాటు ఇతర సరుకులను పౌరఫరాల శాఖ ద్వారా నియమించబడిన డీలర్ల ద్వారా అందుతుంది. వీటి పంపిణీ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు, ,క్షేత్రస్థాయిలో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దేందుకు గతంలో గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, మండల స్థాయిలో తహసీల్దార్‌, డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీఓ చైర్మన్‌గా కమిటీలు ఏర్పాటయ్యేవి. సభ్యులుగా రాజకీయ పార్టీల ప్రతినిదులు, ప్రజా ప్రతినిధులు, ఆహార సలహా సంఘాల సభ్యులు ఉండేవారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై నిత్యావసరాల పంపిణీ, ధరల నియంత్రణ, నిత్యావసరాల్లో నాణ్యతపై చర్చించి, ఆ దిశగా చర్యలు చేపట్టేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీల ఊసే లేకుండా పోయింది. కమిటీల ఏర్పాటులో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహించడంతో ప్రజా సంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది.

ఇష్టారాజ్యంగా సరుకుల అక్రమ తరలింపు..

విజిలెన్స్‌ పర్యవేక్షణ లేకపోవడంతో రేషన్‌ సరఫరా వ్యవస్థ నామమాత్రంగా మారింది. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 2024, అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు జిల్లాలోని వివిద మండలాలలో పౌరసరఫరాల శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన 876 క్వింటాళ్ల నిత్యావసరాలు అక్రమంగా తరలిపోతుండగా పట్టుబడింది. వీటి విలువ సుమారు రూ.22 లక్షలగా అధికారులు లెక్క కట్టారు. ప్రశ్నించేవారు ఎవరూ లేకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా సరుకులను ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. పాఠశాల విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు అందజేసే కోడిగుడ్లు, చిక్కీలు, బియ్యం, ఇతర సరుకుల్లో నాణ్యత లోపిస్తోందనే విమర్శలూ ఉన్నాయి.

ఏడాది పూర్తయినా ఏర్పాటు కాని

పౌరసరఫరాల విజిలెన్స్‌ కమిటీలు

విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటులో

ప్రభుత్వ నిర్లక్ష్యం

పర్యవేక్షణ లేక గాడితప్పిన

పౌరసరఫరాల వ్యవస్థ

పక్కదారి పడుతున్న నిత్యావసరాలు

ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం

గతంలో విజిలెన్స్‌ కమిటీల పర్యవేక్షణ ఉండడంతో రేషన్‌ పంపిణీలో అక్రమాలకు తావు ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా విజిలెన్స్‌ కమిటీలు, ఆహార పర్యవేక్షణ కమిటీలు, ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు మేల్కొనకపోతే ప్రజా పంపిణీ వ్యవస్థ మనుగడ కష్టం.

– సురేష్‌ కుమార్‌, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి

ఉత్తర్వులు రాలేదు

విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. ఉత్తర్వులు జారీ కాగానే కమిటీలు ఏర్పాటు చేస్తాం.

– వంశీకృష్టారెడ్డి, డీఎస్‌ఓ

ఈ నెల 17న కర్ణాటకు అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మడకశిరలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుకొండలోనూ అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పేదల బియ్యం పట్టుబడింది. క్షేత్రస్థాయిలో విజిలెన్స్‌ కమిటీల పర్యవేక్షణ లేకపోవడంతో రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులకు కారణంగా తెలుస్తోంది.

ఓడీసీ మండల వ్యాప్తంగా డీలర్లు రేషన్‌ తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. బియ్యం తూకం వేసే క్రమంలో చక్కెర సంచులు వాడుతుండడంతో కార్డుదారులకు ఒక కిలో మేర బియ్యం తక్కువగా అందుతోంది. అయితే ఈ అక్రమాలను నిలువరించే విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి.

పౌర సరఫరాలు అస్తవ్యస్తం 1
1/2

పౌర సరఫరాలు అస్తవ్యస్తం

పౌర సరఫరాలు అస్తవ్యస్తం 2
2/2

పౌర సరఫరాలు అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement