సాక్షి, టాస్క్‌ఫోర్స్: తాజాగా ఓ రైతు నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్ నారాయణ స్వామికి ఆ ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధి పూర్తి అండగా ఉన్నట్టు తెలుస్తోంది. నారాయణస్వామి అత్యంత అవినీతిపరుడని డిపార్ట్‌మెంట్‌లో పేరుంది. అలాంటి వ్యక్తిని కూటమి సర్కారు రాగానే పట్టుబట్టి పోస్టింగ్ వేయించుకున్నారంటే దీనివెనుక కథ ఏమిటో అంచనా వేయొచ్చు. ఒక సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న నారాయణస్వామికి సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పజెప్పేవరకూ పనిచేయించారంటే అవినీతి కథ ఎలా నడిచిందో తెలుసుకోవచ్చు.
ఒత్తిడి తెచ్చి మరీ పోస్టింగ్..
నారాయణస్వామి శింగనమల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. అప్పటికే కళ్యాణదుర్గం టీడీపీ నేత కంపెనీకి సంబంధించిన పనులు చేసి పెట్టేవారు. జిల్లాస్థాయిలో నారాయణస్వామి పోస్టింగ్‌కు అధికారులు స్పందించడం లేదని ఏకంగా విజయవాడలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఆఫీస్‌కు వెళ్లి ఆయన్ను కళ్యాణదుర్గం బదిలీ చేయించుకున్నారు. అప్పటికే కళ్యాణదుర్గంలో వెంకటనాయుడు అనే సబ్‌రిజిస్ట్రార్ ఉన్నారు. నారాయణస్వామి సీనియర్ అసిస్టెంట్‌గా వెళ్లాక టీడీపీ ప్రజాప్రతినిధితో కలిసి వెంకటనాయుడును టార్చర్ పెట్టారు. రాజకీయ ఒత్తిడి భరించలేక వెంకటనాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే అనంతపురం డీఐజీతో మాట్లాడి నారాయణస్వామికే ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పజెప్పేలా చేశారు.
పైకమిస్తేనే ఫైలుపై సంతకం..
నారాయణస్వామి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు తీసుకున్నాక డబ్బు తీసుకోకుండా ఒక్క ఫైలు మీద కూడా సంతకాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేతకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎలా ఉన్నా చేయడంతో పాటు ఈయన ఇతరుల నుంచి వసూళ్లు చేసిన సొమ్ములో వాటాలిచ్చేవారని చెబుతున్నారు. టీడీపీ నేత కన్‌స్ట్రక్షన్ కంపెనీ స్థలాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నారాయణస్వామే చూసుకునేవారు. టీడీపీ నేత అండ చూసుకునే ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు దిగేవారని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది చెబుతున్నారు. నారాయణ స్వామికంటే జలగలే నయమని సిబ్బంది పేర్కొనడం గమనార్హం.
ఈ–స్టాంపుల కుభకోణంలోనూ
స్వామి పాత్ర?
ఇటీవలే కళ్యాణదుర్గంలో అతిపెద్ద నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణం బయటపడింది. ఇందులోనూ టీడీపీ నేతల ప్రముఖ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ‘మీ–సేవ’ బాబు అయినా.. దీనికి సలహాలు, సూచనలు నారాయణస్వామి ఇచ్చి ఉంటారని అనుమానం కలుగుతున్నట్టు ఓ సబ్‌రిజిస్ట్రార్ వ్యాఖ్యానించారు. నారాయణస్వామి సలహా లేకుండా ఇంత పెద్ద సాహసానికి పాల్పడే ధైర్యం ‘మీ–సేవ’ బాబుకు లేదని అంటున్నారు. ఇలాంటి అవినీతిపరుడిని టీడీపీ నేత దగ్గరుండి పోస్టింగ్ వేయించుకున్నారంటే ఎంత అవినీతి చేసి ఉంటారో అంచనా వేయొచ్చన్నారు. కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధికి బినామీ
కూటమి సర్కారు రాగానే శింగనమల నుంచి కళ్యాణదుర్గానికి పోస్టింగ్
అక్కడున్న సబ్‌రిజిస్ట్రార్‌ను
టార్చర్ పెట్టి వెళ్లగొట్టిన టీడీపీ నేత
అనంతరం సీనియర్ అసిస్టెంట్
నారాయణస్వామికి
ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు
ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పనుల్లో
బినామీగా ఆరోపణలు
నకిలీ ఈ–స్టాంప్ కుంభకోణంలోనూ సలహాలిచ్చి ఉంటారని అనుమానాలు