
బంగారు కుటుంబాల భవిత మార్చాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చేతన్
పుట్టపర్తి అర్బన్: పీ–4 సర్వేలో భాగంగా బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారి భవిత మార్చేందుకు అధికారులు పనిచేయాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆర్డీఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ–4, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శకుల ఎంపిక, నమోదు, గ్రామ సభలు, ప్రభుత్వ పథకాల సేవలు, ప్రజాస్పందనలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..క్షేత్రస్థాయిలో బంగారు కుటుంబాల దత్తత, ఎంపిక, నమోదు ప్రక్రియను త్వరగా ఆన్‌లైన్ చేయాలన్నారు. డాక్యుమెంటేషన్ సైతం వేగంగా పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాలకు పథకాలన్నీ అందేలా చూడాలన్నారు. అలాగే ఆయా మండలాల్లోని వసతి గృహాలను అధికారులు వారంలో ఒకసారి సందర్శించి తాగునీరు, పైప్‌లైను మరమ్మతులతో పాటు ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘తల్లికి వందనం’ కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా ఎంపీడీఓలు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సీపీఓ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఎస్‌డీసీలు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శివరంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీగా ప్రమీల
పుట్టపర్తి అర్బన్: జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రమీల నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె తిరుపతి జిల్లా పుత్తూరు సీడీపీఓగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెకు పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పీడీగా పని చేస్తున్న శ్రీదేవిని తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. నూతన ఐసీడీఎస్ పీడీ ఎప్పుడు విధుల్లో చేరుతారన్న విషయం ఇంకా అధికారికంగా సమాచారం అందలేదు. నూతన పీడీ విధుల్లో చేరే దాకా ప్రస్తుతం ఉన్న పీడీ శ్రీదేవి ఇక్కడే కొనసాగుతారని తెలుస్తోంది.
అది చెరువు స్థలమే!
● చెరువు స్థలం అన్యాక్రాంతంపై
కలెక్టర్ ఆగ్రహం
● సమగ్ర విచారణ..
చెరువు స్థలమేనని తేల్చిన అధికారులు
● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన వైనం
ధర్మవరం: పట్టణంలోని స్పందన ఆస్పత్రికి ఎదురుగా సర్వే నంబర్ 661లోని ఖాళీ స్థలం చెరువు స్థలమేనని అధికారులు తేల్చారు. ఆ స్థలం ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 661లోని చెరువు స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా... ‘ఖాళీ కనిపిస్తే కబ్జా‘ శీర్షికన ఈనెల 21న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై కలెక్టర్ టీఎస్ చేతన్ తీవ్రంగా స్పందించారు. సదరు స్థలం గురించి సమగ్ర వివరాలు కావాలని కోరారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అది చెరువు స్థలమే నిర్ధారించారు. ‘‘ఈ స్థలం ధర్మవరం చెరువుకు సంబంధించింది... ఈ సర్వే నంబర్‌లో ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు జరపరాదు. అలా జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అంటూ హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ధర్మవరం పట్టణ నడిబొడ్డున దాదాపు రూ.కోటికిపైగా విలువైన చెరువు భూమి కబ్జా కాకుండా చూసిన ‘సాక్షి’కి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

బంగారు కుటుంబాల భవిత మార్చాలి

బంగారు కుటుంబాల భవిత మార్చాలి