
కార్మికుల భద్రత గాలికి!
హిందూపురం: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రత, కాలుష్యం వంటి అంశాలపై సంబంధిత శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిశ్రమల్లో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లోని భద్రత డొల్లతనం బయటపడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమలపై ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, ఇతర శాఖల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. పరిశ్రమల స్థాపనకు, కార్మికుల రక్షణకు, భద్రతకు తామేదో చేస్తున్నట్లుగా హైపర్ కమిటీ హడావిడి తప్ప సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదు.
భద్రత ప్రమాణాలు తుంగలోకి
జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గం పరిసరాల్లో సుమారు 20 వేల మందికి పైగా కార్మికులు వివిధ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల ఆధారపడి పరోక్షంగా మరో 50 వేల మంది కార్మికుల జీవనం సాగిస్తున్నారు. హిందూపురం సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, మణేసముద్రంలో స్టీల్, రసాయన పరిశ్రమలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, రబ్బర్, గ్యాస్ తదితరాల ఉత్పత్తికి సంబంధించి దాదాపు 150 చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నాయి. సాంకేతిక కారణాలతో పాటు మానవ తప్పిదాలతో ఆయా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నియంత్రణ, కార్మికుల భద్రతను అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు గాలికి వదిలేసినట్లుగా ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో ఏ ఒక్క పరిశ్రమలోనూ కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం ఇందుకు నిదర్శనం.
మచ్చుకు కొన్ని...
● నాలుగు రోజుల క్రితం గోళ్లాపురంలోని బ్లూగోల్డ్ స్టీల్ పరిశ్రమలో వలస కార్మికుడు అనూప్ ప్రమాదవశత్తూ గాయపడి కాలు పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.
● 8 ఏళ్ల క్రితం హిందూపురం సమీపంలోని ఓ పరిశ్రమలో సిలిండర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులు పొగొట్టుకున్నారు.
● గోళ్లాపురం స్టీల్ పరిశ్రమలో క్రేన్ రోప్ చుట్టుకుని ఓ కార్మికుడు మృతి చెందాడు. అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఓ కార్మికుడు మృతి చెందాడు.
● గోళ్లాపురం స్టీల్ పరిశ్రమలో గతంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అలాగే గత ఏడాది జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. అలాగే కెమికల్ పరిశ్రమలో కార్మికుడు హనుమంతప్ప చేతిపై రసాయనం పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారీ యాజమాన్యాలు గోప్యత పాటించడం పరిపాటిగా మారింది. మరికొన్ని పరిశ్రమల యజమానులు బాధితులకు అంతోఇంతో ఇచ్చి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
పారిశ్రామిక వాడల్లో తరచూ ప్రమాదాలు
నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన అధికారులు
ప్రమాదాల బారిన పడుతున్న
వలస కార్మికులు
ప్రమాదాల నివారణ ముఖ్యం
ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వలస వచ్చి హిందూపురం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో అతి తక్కువ వేతనానికి పనులు చేస్తున్నారు. అయా పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు విషయం బయట పడకుండా బాధితులకు ఎంతో కొంత ముట్టుజెప్పి సర్దుబాటు చేసుకుంటున్నారు. కార్మికుడు మరణిస్తే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను వారి రాష్ట్రాలకు పంపించేస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– రవికుమార్, కార్మిక సంఘం అధ్యక్షుడు, తూముకుంట
బీమా సదుపాయం కల్పించాలి
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించడం లేదు. ప్రమాదాలను దాచి క్షతగాత్రులకు ఎంతో కొంత ముట్టజెప్పి లోబర్చుకుంటున్నారు. ఒక కార్మికుడు ప్రమాదం బారిన పడితే అతని కుటుంబం రోడ్డున పడుతుంది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిచర్యలు చేపట్టాలి. కార్మికులకు బీమా సదుపాయం కల్పించాలి.
– బాబు, కార్మిక సంఘం నాయకుడు, తూముకుంట
పరిశ్రమల్లో భద్రతను గాలికి వదిలేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తరువాత మర్చిపోవడం జిల్లాలోని అధికారుల నుంచి యజమానుల వరకు సాధారణమైపోయింది. ప్రతి నెలా సగటున రెండు నుంచి మూడు ప్రమాదాలు జరుగుతున్నా వీరి వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు.
త్వరలో స్పెషల్ డ్రైవ్
ఇప్పుడున్న ఈఓడీడీ యాక్ట్ ప్రకారం పరిశ్రమల్లో సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లపై యాజమాన్యాలు నివేదికలు అందజేయాలి. వీటి ఆధారంగా పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి కార్మికుల భద్రత, ప్రమాదాల నివారణ చర్యలపై అవసరమైన సూచనలిస్తాం. తూముకుంటలోని స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఇదే కాకుండా త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని పరిశ్రమలను తనిఖీ చేయనున్నాం.
– రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్, పరిశ్రమల శాఖ,
అనంతపురం

కార్మికుల భద్రత గాలికి!

కార్మికుల భద్రత గాలికి!