అంధకారంలో 20 పల్లెలు
ముదిగుబ్బ: మండలంలోని మల్లేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని 20 పల్లెల్లో అంధకారం అలుముకుంది. మూడు రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తప్పెటవారిపల్లి సమీపంలో 33 కేవీ లైన్‌కు సంబంధించిన మూడు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అదే సమయంలో సబ్‌స్టేషన్‌లోనూ కొన్నిచోట్ల డ్యామేజీ జరిగింది. దీంతో మల్లేపల్లి, తప్పెటవారిపల్లి, ఒడ్డుకింద తండా, కొండగట్టుపల్లి పంచాయతీల పరిధిలోని 20 గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ రాత్రంతా చీకట్లోనే ఇబ్బందిపడిన ప్రజలు మంగళవారం ఉదయం లైన్‌మెన్లను ఆరా తీశారు. ఇదిగో గంటలో కరెంట్ వస్తుంది.. మధ్యాహ్నం.. సాయంత్రం ఇలా చెప్పుకుంటూ వచ్చారు. గంటలు పోయి.. రోజులు గడుస్తున్నా ఎటువంటి పురోగతీ లేదు. మూడు రోజులైనా అధికారులు స్పందించకపోవడం, ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలే వేసవి. ఉక్కపోత అధికంగా ఉంది. కరెంటు లేక ఫ్యాన్లు, కూలర్లు ఆగిపోయాయి. జనం అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటోంది. సెల్‌ఫోన్లు కూడా చార్జింగ్ అయిపోయాయి. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈదురుగాలులతో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మూడు రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్న ప్రజలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో అధికారుల తాత్సారం


