ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నాం: డీఐఓ మౌల
పుట్టపర్తి: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి (డీఐఓ) సయ్యద్‌మౌల తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. 19వ తేదీ వరకూ రోజూ ఉదయం 9 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రెండు ఫ్లయింగ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ మెంబర్లుగా రామరాజు, చెన్నకేశవప్రసాద్, శ్రీనివాసులను నియమించామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.
9 రకాల పాఠశాల విధానానికి వ్యతిరేకం
పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల పాఠశాల విధానానికి ఏపీటీఎఫ్ వ్యతిరేకమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శనివారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 9 రకాల పాఠశాల విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ 1 నుంచి 5 వ తరగతి వరకు కొనసాగించాలన్నారు. జీఓ 117ను రద్దు చేస్తామని చెప్పి ఇంత వరకూ రద్దు చేయకుండా రకరకాల సమీక్షలు చేస్తూ విద్యాశాఖతో ఆడుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నత పాఠశాలను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇంత వరకూ పీఆర్సీ కమిటీని నియమించలేదన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మాధవ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలు, సబ్ కమిటీ మెంబర్లు నారాయణ, నాగరాజు, సుధాకరరెడ్డి, రఫీ, మండల ప్రధాన కార్యదర్శులు సాయిశివ, వెంకటనాయుడు, హరిప్రసాద్, వెంకటరమణనాయక్, ఈశ్వరప్ప, సేవేనాయక్, చంద్రమౌళి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
బాలుడిని మింగిన స్విమ్మింగ్‌పూల్
ధర్మవరం అర్బన్: ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పోతరాయి గ్రామానికి చెందిన సంజీవనాయుడు, శారద దంపతుల కుమారుడు నందీశ్వర్‌నాయుడు (9) ధర్మవరంలో తేరు ఉందని గీతానగర్‌లో ఉంటున్న బాబాయి కృష్ణ ఇంటికి రెండురోజుల క్రితం వచ్చాడు. తేరు చూసిన తర్వాత శనివారం మధ్యాహ్నం జీవానంద పాఠశాల సమీపంలోని రేగాటిపల్లి రోడ్డులోనున్న స్విమ్మింగ్ పూల్‌కు ఈత కోసం బాబాయితోపాటు నందీశ్వర్‌నాయుడు వెళ్లాడు. నీటిలో ఆడుకుంటున్న నందీశ్వర్‌నాయుడు ఉన్నట్టుండి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలోకి దిగి నీట మునిగాడు. స్థానికులు గమనించి వెంటనే బాలుడిని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నందీశ్వర్‌నాయుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ