‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించేలా చూడాలని కోరారు.
డీఎంఈ నరసింహం


