
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ప్రశాంతి నిలయం: ‘‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలి. ఎంపీడీఓలంతా ఈ కార్యక్రమాలు పర్యవేక్షించాలి. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేది లేదు. కఠిన చర్యలకూ వెనుకాడబోం’’ అంటూ కలెక్టర్ చేతన్ ఎంపీడీఓలను హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ‘నీరు–మీరు’ అనే థీమ్‌తో నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలు, బహిరంగ ప్రదేశాల్లోని నీటి సేకరణ నిర్మాణాలను శుభ్రపరచడంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి సేకరణను ఉపయోగించుకోవడానికి ఈ మూడు వారాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు, భూగర్భ జల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలన్నారు. లేపాక్షి, హిందూపురం, రొళ్ల, అగళి, నల్లమాడ, తనకల్లు, కొత్తచెరువు మండలాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా చెత్త సేకరణ, రవాణాకు ఉపయోగించే పరికరాలు నిరుపయోగంగా ఉండకూడదన్నారు. సమావేశంలో డీపీఓ సమత, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జునప్ప, గ్రామ/వార్డు సచివాలయాల నోడ్ అధికారి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సంతృప్తి పడేలా
పథకాలు అమలు చేయాలి..
సంక్షేమ పథకాలు ప్రజలు సంతృప్తి పడేలా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ మెరుగుదలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయాలన్నారు. అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌ఓ పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ‘దీపం’ పథకం కింద గ్యాస్ డెలివరీకి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఎంపీడీఓలను హెచ్చరించిన
కలెక్టర్ టీఎస్ చేతన్
స్వచ్ఛతా కార్యక్రమాలతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం