
టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగం ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్‌ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది.
టీచర్ల బదిలీలకు వేళాయె
● నేటి నుంచి హెచ్‌ఎంల బదిలీలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్‌ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్‌హెచ్‌ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. హెచ్‌ఎం పోస్టులు 178 ఖాలీలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్‌ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్‌లో రెండేళ్లు పూర్తయిండాలి) కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
నేడు జెడ్పీ
సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి మంగళవారం సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.